చెరిపేయాలనుకుంటే చరిత్ర చెరిగిపోదు. చరిత్రనే నిర్మించిన మూర్తిని తెరమరుగు చేయాలనుకుంటే అది పగటి కలే అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి ప్రతిరూపమైన కేసీఆర్ ఈ గడ్డకు పంచప్రాణాలు. అరచేతిలో స్వర్గం చూపిన టక్కుటమార మూక బేకార్ పాలనలో రైతులు, మహిళలు, వృద్ధులు ఇలా అన్నివర్గాలు అరిగోస అనుభవిస్తున్నాయి. తెలంగాణ మట్టిలో మొలకెత్తిన పార్టీ.. ఇక్కడి చరిత్రతో పెనవేసుకొని ఎదిగిన పార్టీగా బీఆర్ఎస్ స్థానం ప్రత్యేకమైనది. అందుకే ఇది దీక్షా సమయం, పరీక్షా సమయం అంటూ పార్టీని కేసీఆర్ సన్నద్ధం చేశారు. ‘సింగంబాకటితో’ అన్నట్టుగా కేసీఆర్ మరోమారు ఆయుధాలు సంధించి, సమరశంఖం పూరించారు. ఢిల్లీ పార్టీ ముంచితే అండగా నిలవాల్సింది గల్లీ పార్టీయే కదా. నాడు, నేడు, ఏనాడైనా తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామ రక్ష అని చాటిచెప్పడం పార్టీ శ్రేణుల్లో కొండంత ధైర్యం నింపింది. అవరోధాలు తాత్కాలికం, బీఆర్ఎస్ శాశ్వతమంటూ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కర్తవ్యబోధ చేశారు. కదనానికి సమాయత్తం చేశారు.
తెలంగాణ అస్తిత్వం కోసం జరిపిన అవిశ్రాంత పోరులో కేసీఆర్ ఎన్ని ఎదురు దెబ్బలను తట్టుకొని నిలవలేదు? ఎన్ని ఆటంకాలను విజయానికి సోపానాలుగా మలచుకుని జైత్రయాత్ర చేయలేదు? తన వ్యూహ చతురతతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ మునుముందుకు సాగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచి గమ్యాన్ని ముద్దాడిన పార్టీ బీఆర్ఎస్. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ తన మేధోమథనంతో ఈ గడ్డను విజయపథంలో నిలిపారు. కానీ ఓటరు మోసపోయి గోసపడుతున్నడు. అదాటున మరుగుజ్జుల ఆధిపత్యంలోకి వెళ్లిన తెలంగాణ 14 నెలలుగా ఆగమైపోతున్నది. తెలంగాణ సోయిలేని అక్రమార్కుల శిశుపాల నేరాల చిట్టా చివరి ఘట్టానికి చేరుకుంటున్నది. ‘మళ్లీ మొలవనివ్వను.. తరిమేస్తా’ అనే రాజకీయ తెంపరితనపు కూతలు అంతకంతకూ పేలవంగా ధ్వనిస్తున్నాయి.
తెలంగాణను గుండెల్లో పొదువుకునే కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా? ఆయన ఆయుధాలు సవరించుకుంటుంటే అవతలి పక్షంలోనూ ‘వచ్చెడివాడు ఫల్గుణుడన్న’ తత్తరపాటు ధ్వనిస్తున్నది. మోసాల వాసాలపై వెలిసిన వంద కల్లల అధికార సౌధం ఊగిసలాడుతున్నది. పదేండ్ల పాలన వెలుగులు ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయి. ఏడాది పైచిలుకు పరిపాలనా ప్రహసనం ఎదురుగానే కనిపిస్తున్నది. ఇత్తేసి పొత్తుగూడి, ఆపై దశాబ్దాల పాటు అణచివేత, దోపిడీకి గురిచేసిన ద్రోహులు… మారిన పరిస్థితుల్లో రెచ్చిపోయి మరోసారి బుసలు కొడుతున్నారు. ము సుగులు వేసుకొని దూరిపోవాలని చూస్తున్నారు. అందుకే తెలంగాణ అసాధారణ పోరాట చైతన్యం ఆవిరి కానివ్వొద్దని కేసీఆర్ పిలుపునిచ్చా రు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఫిరాయింపుల మొరాయింపు పైనా చెణుకులు వేశారు. అరచేతిలో స్వర్గం చూపి అడ్డగోలుగా ముంచినోళ్ల దుంప తెంచాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఓటుపోటుతోనే గుణపాఠం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. అందుకే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమని కేసీఆర్ చెప్పడం పార్టీలో కొండంత బలం నింపింది. కేసీఆర్ పిలుపే ఓ ప్రభంజనం. జంగ్సైరన్ మోగింది. ఇక సమరమే.