2009 నవంబర్ 23న కేయూలో ఉద్యమానికి ఇక్కడి నుంచే నాంది
జ్ఞాపకాలను నెమరేసుకుంటున్న కేయూ విద్యార్థి ఉద్యమ నాయకులు
Kakatiya University | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 22 : మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరో ప్రస్థానం. అత్యంత కీలకమైన రోజు. యావత్తు తెలంగాణ జాగృతమైన దినం. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు. కాకతీయ యూనివర్సిటీలో నవంబర్ 23, 2009 నాడు నిర్వహించిన కేసీఆర్ సభ ఉద్యమానికి నాంది పలికింది. 2009 నవంబర్ 29వ తేదీన సిద్దిపేట వేదికగా ‘కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా ఆంధ్ర పాలకులు హైదరాబాద్ ప్రాంతాన్ని ఫ్రీ జోన్ అని ప్రకటిస్తే, 6వ జోన్లో అంతర్భాగం అనే డిమాండ్‌తో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎజెండాలను పక్కనపెట్టి 12 విద్యార్థి సంఘాలు టీఆర్ఎస్వీ, ఏబీఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, టీజీఏ, ఏబీవీపీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, కుల్సా, టీబీఎస్ఎఫ్, బీసీ విద్యార్థి సంఘం, టీవీవీ, కుర్సా, తదితర సంఘాలతో తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్ జాక్) గా రాష్ర్టంలోనే కాకతీయ విశ్వవిద్యాలయంలో 2009 నవంబర్ 17వ తేదీన తొలి విద్యార్థి జాక్ ఆవిర్భావించింది.

50 వేల విద్యార్థులతో సదస్సు..
కేసీఆర్ దీక్షకు వారం రోజుల ముందు కాకతీయ విశ్వవిద్యాలయంలోని మొదటి గేట్ దగ్గరలో ఉన్న కాన్వకేషన్ గ్రౌండ్లో టీఎస్ జాక్ ఆధ్వర్యంలో 50 వేల మంది విద్యార్థులతో సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ పాల్గొన్నారు. సదస్సులో మొదటగా 12 విద్యార్థి సంఘాల బాధ్యులు మాట్లాడారు. తర్వాత జయశంకర్ సార్ మాట్లాడారు.
ప్రధాన వక్తగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ఆవశ్యకత, ఆంధ్ర పాలకుల నిరంకుశ దోపిడీ పాలన, గురించి విద్యార్థులను ఈ సదస్సు ద్వారా చైతన్యం చేశారు. ఉద్యమానికి ఈ సభనే విద్యార్థి ఉద్యమానికి నాంది పలికింది. తెలంగాణ ఉద్యమకారులు, ఇండ్ల నాగేశ్వర్రావు, మర్రి యాదవరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి జాక్ ఏర్పడింది. 12 విద్యార్థి సంఘాల బాధ్యులు టీఆర్ఎస్వీ వాసుదేవరెడ్డి, ఏబీఎస్ఎఫ్ జోరిక రమేష్, ఏఐఎస్ఎఫ్ వలి ఉల్లా ఖాద్రీ, పీడీఎస్‌యూ రాజేందర్, ఏబీవీపీ పెంచాల శ్రీనివాస్, టీబీఎస్ఎఫ్ నొడపల్లి మురళి, టీజీఏ ఉషికేమల్ల శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం ఎర్రబొజ్జు రమేష్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం బూజుగుండ్ల అనిల్, కేయూ లా స్టూడెంట్స్ అసోసియేషన్ శ్రీనివాస్, కొప్పుల సైదిరెడ్డి, శ్రీరాం శ్యామ్, విద్యార్థి నాయకులు వేదిక మీద మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టం వచ్చేదాకా కేసీఆర్ స్పూర్తితో విద్యార్థులు ఉద్యమించారు.
కేసీఆర్ సభ విద్యార్థి ఉద్యమానికి నాంది పలికింది

కాకతీయ యూనివర్సిటీలో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్‌తో 2009 నవంబర్ 23న నిర్వహించిన సభ విద్యార్థి ఉద్యమానికి నాంది పలికింది. సభలో అప్పటి విద్యార్థి నాయకుడిగా మాట్లాడుతూ కేసీఆర్‌కి మద్దతుగా యావత్ విద్యార్థి లోకం మద్దతు ఇస్తున్నామని ప్రకటించా. అంబేద్కర్ గారి ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాల ఎర్పాటు ఆవశ్యకతను రాజ్యాంగంలో పొందు పరిచిరాని అంబేద్కర్ గారి స్పూర్తితో ఉద్యమిస్తామని ఆరోజు మాట్లాడాను. తెలంగాణ రాష్ర్ట సాధనలో అత్యధిక కేసులు నా మీదనే నమోదయ్యాయి. నాలుగుసార్లు జైల్‌కి వెళ్లాను. 21 రోజులు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించాను. ఆనాటి జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేను.
– ఉమ్మడి వరంగల్ జిల్లా జాక్ కన్వీనర్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్