‘సింగంబాకటితో’ అన్నట్టుగా కేసీఆర్ రంగం మీదకు వచ్చారు. మోసకారి పాలనలో గోసపడుతున్న తెలంగాణ భుజం తట్టారు. ప్రజల సజల నేత్రాలను తుడిచి అక్రమార్కులపై ధనుష్టంకారం చేశారు. జనాక్షౌహిణుల సేనాని జలగర్జనతో దిక్కులు పిక్కటిల్లాయి. ఆర్తిగా ఎదురుచూస్తున్న అశేష జనావళికి ఆయన రాక ఓ ధీమా.. ఆయన మాటే ఓ భరోసా. ఆయన కంఠంలో మార్మోగింది ప్రజాగళ గర్జన. నయవంచక పరిపాలకుల్లో అప్పుడే మొదలయ్యింది తర్జనభర్జన.
అవును, కేసీఆర్ ఎందుకు రావలసి వచ్చింది? మరోసారి సమర శంఖం ఎందుకు పూరించాల్సి వచ్చింది? అరచేతిలో వైకుంఠం చూపి అధికారాన్ని హస్తగతం చేసుకున్న ‘శిశుపాలకులు’ నూరు తప్పులు చేశారు. కారుకూతలు కూశారు. మన నీటి హక్కులకు దిక్కు లేకుండా పోతుంటే పక్క చూపులు చూశారు. నీళ్లు, నిధులు, నియామకాల పోరులో నిప్పులగుండం తొక్కిన తెలంగాణను నీరుగార్చినందుకు వచ్చారు కేసీఆర్. పోరాట ఫలాలను దిగజార్చినందుకు వచ్చారు కేసీఆర్. మన వాటా జలాలను పొరుగుబాట పట్టిస్తుంటే సహించలేక వచ్చారు కేసీఆర్. ఇంట్లోవాళ్ల కడుపులు మాడ్చి, దొంగలకు సద్ది గట్టిస్తుంటే చూసి సహించలేక వచ్చారు కేసీఆర్.
కేసీఆర్ మౌనాన్ని వీడి మాటలను ఈటెలుగా విసిరారు. కానీ, ఒక్క పేరూ ఉచ్ఛరించలేదు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ విమర్శలు సంధించారో అందరికీ తెలిసిందే. నాడు ఉద్యమంలోనైనా, నేడు విపక్షంగా ఉన్నా పాలమూరే ఎజెండా. గోస తెలిసిన నేత కదా, పాలమూరే తన తలపుల నిండా. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరునే ప్రాధాన్యతతో ఎంచుకున్నది. పాలమూరును పండబెట్టి, పచ్చదనాన్ని ఎండబెట్టి, కోతికొమ్మచ్చులాడుతుంటే వాతలు పెట్టేందుకు వచ్చారు కేసీఆర్. అవాకులు, చవాకులు పేలిన అనామకులను అనామకులుగానే ఎండగట్టేందుకు వచ్చారు కేసీఆర్. ‘నేతలము మీ నుదుటి రాతలమురా మేము’ అని ప్రజల బాధలు పట్టని పాలక శిఖామణులు విర్రవీగుతుంటే కర్రు గాల్చి వాత పెట్టేందుకు వచ్చారు కేసీఆర్.
పదేండ్ల వైభవం గతమైపోయి, బతుకు ఆగమాగమైపోయి అల్లాడుతున్న ప్రజల భుజం తట్టారు. చేవలేని, చేతగాని పాలనపై తొడగొట్టారు. కేసీఆర్ అంటే ఎవరనుకున్నారు? మూడు ఆకాంక్షలు, మూడక్షరాలు పెనవేసుకున్న తెలంగాణ వీరగాథ. ఆటుపోట్ల మధ్య ఆగమైపోయిన తెలంగాణ అస్తిత్వాన్ని తట్టిలేపి విజయతీరాలకు చేర్చిన చాణక్యం. చావు నోట్లో తలపెట్టి గమ్యాన్ని ముద్దాడిన అపూర్వ సాహసం, అరుదైన చాతుర్యం. ఒకరి చావును కోరుకునే అనాగరికుల గుండెల్లో గుబులు పుట్టించే శంఖారావం, ఢంకాధ్వానం. తెలగాణ నిగళాలు తెగటార్చిన రణన్నినాదం.
నాడు పరాయి పాలనపై పోరాడిందీ కేసీఆరే. నేడు ఇంటోడే తెలంగాణ తల్లి కిరీటాన్ని పడగొట్టి, తెలంగాణ ప్రజలను అధోగతి పాలుజేసి, పరాయోడి భజనలో తరిస్తుంటే పొలికేక వేసిందీ కేసీఆరే. తెలంగాణ సోయిలేని నడమంత్రపు పాలకులు అస్తిత్వానికి ఎసరు తెస్తుంటే మౌనాన్ని వీడి మరో పోరుకు నడుం బిగించిందీ కేసీఆరే. కేసీఆర్కు పోరాటం కొత్త కాదు. గెలవడమూ కొత్త కాదు. తెలంగాణ కోసం తెగించి బయల్దేరిన రోజు తాను ఒక్కడు. కానీ, ఈనాడు తెలంగాణ గుండెచప్పుడు.
తెలంగాణ మమకారం, నుడికారం. తెలంగాణ హక్కులకు ఉక్కు ప్రాకారం. అతడు తెలంగాణ జయకేతనం. అతడి కీర్తి నిత్యనూతనం. అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసింది అతడే. సాధించిన తెలంగాణను సమున్నతంగా నిలబెట్టిన పరిపాలనాదక్షుడూ అతడే. ఇచ్చిన మాట నిలబెట్టుకోని ఇచ్చకాల పాలన ఇంకెన్నాళ్లు? అని ఇప్పుడు నిలదీసిందీ అతడే. బరిగీసిందీ అతడే. చెడగొట్టు పాలనపై తొడగొట్టిందీ అతడే. నిలిచేదీ అతడే, గెలిచేదీ అతడే. అనామక, అరాచక పాలకులారా, తస్మాత్ జాగ్రత్త!