సూర్యాపేట, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఏడెనిమిది దశాబ్దాలపాటు ఆయన నిస్వార్థంగా తన గ్రామ ప్రజలందరికీ సేవలందించారు. తలలో నాలుకలాగా ఉంటూ ఎవరికి ఎటువంటి అవసరమొచ్చినా.. చేతనైన సాయం అందించారు. ఎన్నిసార్లు అవకాశం వచ్చినా ఎన్నడూ ఎన్నికల్లో పోటీచేయలేదు. కానీ ఈసారి గ్రామ ప్రజలంతా మూకుమ్మడిగా బలవంతం చేయడంతో తన 95వ ఏట సర్పంచ్‌గా గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆయనే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండల కేంద్రం సర్పంచ్ గుంటకండ్ల రామచంద్రారెడ్డి.
తన సుదీర్ఘ జీవిత అనుభవాలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ పదాలను ఉపయోగిస్తూ పూసగుచ్చినట్టు వివరించగలరు. సర్పంచ్‌గా సోమవారం ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. తనకు చిన్న నాటి నుంచి ప్రజలకు సేవ చేయడం అలవాటైందని చెప్పారు. కుటుంబంలో పెద్దవాళ్లు దేశ స్వాతంత్య్రోద్యమంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయం చూసుకున్నానని తెలిపారు. కుటుంబ పరిస్థితుల రీత్యా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు.
అనుకోకుండా వచ్చిన అవకాశం ఇది
గ్రామంలో కులం, మతం అని చూడకుండా ఏ అవసరం వచ్చినా ఉచితంగా చేసేవాడినని రామచంద్రారెడ్డి చెప్పారు. గ్రామంలో తన సేవలు పొందని కుటుంబం ఒక్కటి కూడా ఉండదని పేర్కొన్నారు. తన జీవితంలో ఎన్నో ఉద్యమాలు చూశానని, కానీ తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఉద్యమం ఎప్పటికీ గుర్తుండి పోతుందని చెప్పారు. గ్రామ పంచాయతీలు ఏర్పడిన నాటి నుంచి 1981 వరకు గ్రామ సర్పంచ్‌గా తన అన్న పిచ్చిరెడ్డి ఉన్నారని తెలిపారు. ఆ తరువాత తనను సర్పంచ్‌గా ఉండాలని ఎంత ఒత్తిడి వచ్చినా తాను నిలబడకుండా ఇతరులను బరిలోకి దించి గెలిపించుకున్నానని చెప్పారు. తన శ్రీమతి దివంగత సావిత్రమ్మ పేరిట గ్రామంలో శాశ్వతంగా నిలిచిపోయే కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన తనకు ఉండేదని తెలిపారు.
ప్రజలు ఆశించిన సేవలు అందిస్తా
‘ఈ నా చివరి దశలో నాగారం ప్రజలు ఆదరించిండ్రు. ఎందుకో ఈ చివరి దశలో మళ్లీ నాతో గ్రామానికి సేవలు తీసుకోవాలని కోరుకున్నరు. భగవంతుడు అవకాశం ఇస్తే ఐదేండ్లలో ప్రజలు నా నుంచి ఆశించిన సహాయ సహకారాలు, సేవలు అందిస్తా. ఈ గ్రామానికి పేద ప్రజలు కార్యాలు జరుపుకోవడానికి సౌకర్యం లేదు. నా పాత రెండు బంగ్లాలు తీసేసి ఆ భూమిలో నా భార్య సావిత్రమ్మ పేరిట సొంత డబ్బుతో ఒక భవనం నిర్మించి ఊరికి కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. వంద సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన శివాలయం వద్ద షెడ్లు నిర్మించి, ఆ ప్రాంగణం అభివృద్ధి చేస్తా. 1953లో నేను నిర్మాణం చేయించిన పాఠశాల భవనం స్థానంలో ఇప్పటి అవసరాలకు అనుగుణంగా కొత్త భవనాన్ని విద్యార్థులకు ఇస్తా. నేను కష్టపడి తీసుకొచ్చిన దవాఖానలో మరిన్ని వైద్య సేవలు విస్తరణ చేయిస్తా’ అని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.