రామచంద్రాపురం, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ముందుచూపుతోని రాజ్యాంగంలో మెజార్టీ అనే పదాన్ని తొలిగించి ఆర్టికల్ 3ని ప్రవేశపెట్టడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొల్లూర్‌లో అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు మాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కురుమ సంఘం సీనియర్ నాయకుడు క్యామ మల్లేశం, బీఆర్ఎస్ పటాన్చెరు ఇన్‌ఛార్జి ఆదర్శ్‌రెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి హరీశ్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎమ్మెల్యేలు 119 ఉంటే, ఏపీ ఎమ్మెల్యేలు 175 ఉండేవారని, మెజార్టీ అనే పదాన్ని తొలిగించకపోతే తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ రాకపోయేదన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదని..అందరివాడని..తెలంగాణకు మరింత దగ్గరి వాడు అని పేర్కొన్నారు. చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపిన మహనీయుడు అని కొనియాడారు.
ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదువుకొని తాను సంపాధించిన జ్ఞానాన్ని దేశ ప్రజల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఉపయోగించి గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. దేశంలో ప్రజలందరూ సమాన హక్కులు పొందుతున్నామంటే, దానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని తెలిపారు. మహిళలకు, కార్మికులకు దళిత, గిరిజన అన్ని వర్గాల్లో అంబేద్కర్ వెలుగులు నింపారని ఉద్ఘటించారు. చదవండి,బోధించండి,సమీకరించండి, పోరాడండి అనే మంత్రాన్ని చెప్పాడని, దానిని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు.
చదువు లేకుంటే జీవితం లేదు, వివక్షపై పోరాటం చేయాలని అంబేద్కర్ పిలుపునిచ్చారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టారని, ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్‌యాదవ్, నాయకులు సోమిరెడ్డి, బాల్‌రెడ్డి, యాదయ్య, వెంకట్రామిరెడ్డి, నర్సింములు, బుచ్చిరెడ్డి, లచ్చిరాంనాయక్, బాబ్జీ, నాగరాజు, సాగర్, సురేశ్, శ్రీనివాస్, పి.శ్రీనివాస్, మహిపాల్, ప్రవీణ్, గణేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.