అన్నపురెడ్డిపల్లి, మార్చి 4: ‘అపర భగీరథుడు.. కేసీఆర్’కు ఆజన్మాంతం రుణపడి ఉంటామని అన్నపురెడ్డిపల్లి మండల రైతు లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీళ్లు తమ పంట పొలాలకు చేరడం పట్ల భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల రైతులు హర్షం వ్యక్తంచేశారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా ఉన్న ములకలపల్లి మండలం కమలాపురం పంపుహౌస్-3 నుంచి సోమవారం రాత్రి అధికారులు తొలిసారిగా సాగునీటిని విడుదల చేశారు. ఆ నీళ్లు సీతారామ కాలువ ద్వారా మంగళవారం అన్నపురెడ్డిపల్లి మండలానికి చేరుకున్నాయి. తమ పంట పొలాల్లోకి చేరిన గోదావరి జలాలను తాకి ఆయా గ్రామాల రైతులు మురిసిపోయారు. నర్సాపురం రెవెన్యూలోని రైతులు కాలువలోని గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే కేసీఆర్ ఫ్లెక్సీకి పాలు, గోదావరి జలాలతో అభిషేకం చేశారు. ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్..’ అంటూ నినాదాలు చేశారు.