హైదరాబాద్, ఆగస్టు 28( నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. వరద ప్రభావిత ప్రాంతాలైన, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల తదితర జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సర్కారు అందజేస్తున్న సహాయక చర్యలపై ఆరాతీశారు. అనేక చోట్ల కాలనీలు నీటమునగి నివాసాల్లోకి వరద చేరి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ సంభించి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ శ్రేణులు వెంటనే సహాయక చర్యల్లో పాలుపంచుకొనేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. బాధితులకు అందుబాటులో ఉం డాలని నిర్దేశించారు. అవసరం మేరకు తాగునీరు, ఆహారం, దుస్తులు, వంట సరుకులు అందించి అండగా నిలవాలని సూచించారు. నష్టతీవ్రతను వెంటవెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులకు అండగా ఉండాలని కోరారు.
ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం వినాయక చవితిని ఘనంగా జరుపుకొన్నారు. కేసీఆర్-శోభమ్మ దంపతులు గణపతి పూజ చేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆదిదేవుడిని వేడుకున్నారు. ప్రజలందరూ నవరాత్రి ఉత్సవాలను మతసామరస్యం, భక్తిభావంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.