సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, మాన్యుఫాక్చర్, బ్యాంకింగ్, మార్కెట్‌కు చెందిన అన్ని రంగాల కంపెనీలలో భారీ సంఖ్యలో ప్రైవేటు ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి. సంవత్సరానికి రూ.10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. మార్కెట్ రంగంలో నెలకు రూ.10 వేల నుంచి రూ 1.50 లక్షల వరకు జీతం ప్రకటించారు. దీంతో ఈ మేళాకు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీలలో ఉద్యోగ ఖాళీగా ఉన్న విషయాన్ని చాలా మంది యువతకు తెలిసే అవకాశాలు లేవు. దీంతో డిగ్రీలు, బీటెక్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్/ఫుడ్ టెక్నాలజీ వంటి అన్ని రకాల విద్యార్హతలు పొందిన యువత సరైన మార్గదర్శకత్వం లేక పోవడంతో ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న మెగాజాబ్ మేళాలు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. అందులో భాగంగా ఈ నెల 15, 16 తేదీలలో జేఎన్టీయూ హైదరాబాద్ వేదికగా మరో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కట్టా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ మెగా ఉద్యోగాల మేళాలను నిర్వహిస్తున్నామని ఆ యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ సురేశ్ తెలిపారు.
అందుబాటులో 10 వేల ఉద్యోగాలు
మంగళ, బుధవారం నిర్వహించనున్న జేఎన్టీయూ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాకు దాదాపు 20 వేలకు పైగా నిరుద్యోగ యువత ఉద్యోగాలు కోసం వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్లేస్మెంట్ ఆఫీసర్ అభిప్రాయపడుతున్నారు. సాధారణ డిగ్రీలు పూర్తి చేసిన వారితో పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీకామ/బీఏతో పాటు పీజీలు పూర్తి చేసి ఉండాలి. అలాగే టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాలకు ఐటీ, టెక్నాలజీకి రంగానికి చెందిన ఉద్యోగాలకు బీటెక్/ ఎంటెక్ పూర్తి చేసిన వారు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. అలాగే ఐటీఐ, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా కొన్ని కంపెనీలు ఆ స్తాయిలో ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. సెయింట్, రోలిస్ట్ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ ఫౌండేషన్, జెన్‌ప్యాక్, మార్కెటింగ్, హెచ్ఆర్ డిపార్టుమెంట్‌కు చెందిన కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి జాబ్‌మేళకు వస్తున్నటాయి. ఆయా రంగాలకు చెందిన కంపెనీలలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌కు చెంది న ఉద్యోగాల కోసం నెలకు రూ.80 వేలు, రూ. 58 వేలు, 50 వేలు చొప్పున జీతం ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కనీసం 10 వేల నుంచి గరిష్టంగా నెలకు రూ.1.50 లక్షల వరకు జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. నిరుద్యోగ యువతకు ప్రైవేటు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళా అవకాశాలను స ద్వినియోగం పరుచుకోవాలని ఆ యూనివర్సిటీ వీసీ కట్టా నరసింహారెడ్డి నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసం యువత తమ సర్టిఫికెట్లతో సహా హాజరుకావాల్సి ఉందన్నారు.
16, 17 తేదీల్లో టీ-సేవా ఆధ్వర్యంలో..
కాచిగూడ, మార్చి 14: నిరుద్యోగ సమస్యను తరిమికొట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా టీ-సేవా కేంద్రం ఆధ్వర్యంలో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16,17 తేదీలలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు టీ-సేవా కేంద్రం ప్లాట్ నెంబర్ 403, శ్రీనిలయం, సంపూర్ణ సూపర్ మార్కెట్‌పైన లాంకోహిల్స్ రోడ్ మణికొండలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ జాబ్ మేళాలో ఇంటర్, పీజీ, ఇంజినీరింగ్, ఎంబీఏ అర్హత గల విద్యార్థులు పాల్గొనవచ్చని, అదే విధంగా ఇందు లో పాల్గొనే యువకులు వాట్సాప్ ద్వారా కూడా బయోడేటాను పంపవచ్చని, ఈ జాబ్‌మేళాలో 102 పేరొందిన ప్రైవేటు కంపెనీలు పాల్గొననున్నట్లు చెప్పారు. వివరాలకు 9505800048లో సంప్రదించాలని ఆయన కోరారు.