కలెక్టరేట్, మార్చి 9: చౌకధరల దుకాణాల్లో వినియోగదారులకు మినీ సిలిండర్లు అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం ఆయన నగరంలోని రేషన్ డీలర్లు, గ్యాస్ ఏజెన్సీల యజమానులు, సేల్స్ అధికారులు, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, 5కిలోల మినీ సిలిండర్లను చౌక ధరల దుకాణాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్నారు. రేషన్ డీలర్లు, సేల్స్ అధికారులు సమన్వయంతో స్టాక్ ఏర్పాటు చేసి అవసరమున్న వినియోగదారుడికి సిలిండర్లు అందించాలన్నారు. బీఎస్ఎన్ఎల్ సిబ్బందితో రేషన్ డీలర్లు మాట్లాడి ఇంటర్నెట్ సదుపాయం పొందాలన్నారు. కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న డీలర్లకు వెంటనే ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని బీఎస్ఎన్ఎల్ సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి సురేశ్‌రెడ్డి, మెప్మా పీడీ రవీందర్, పౌర సరఫరాల శాఖ సిబ్బంది, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, చౌక ధరల దుకాణాల డీలర్లు, గ్యాస్ ఏజెన్సీ డీలర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.