– అరైవ్ & అలైవ్పై సూర్యాపేట ఆర్టీసీ డిపో డ్రైవర్లకు అవగాహన
సూర్యాపేట టౌన్, జనవరి 16 : ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత కలిగిన ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది రోడ్డు భద్రతా నియమాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం అన్నారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు శుక్రవారం సూర్యాపేట పట్టణ ఆర్టీసీ డిపోలో అరైవ్ & అలైవ్ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. నిత్యం వందలాది మంది ప్రయాణికులతో ప్రయాణించే డ్రైవర్లు రోడ్డుపై అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. అతివేగం, అజాగ్రత్త ప్రాణాల మీదకు తెస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమన్నారు. డ్రైవర్ల చిన్నపాటి తప్పిదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతుందని వివరించారు. వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీ సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరించి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సీఐ సైదులు నాయక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.