న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ కంపెనీ నుంచి రఫేల్ యుద్ధ విమానాల(Rafale Jets)ను భారత్ కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా ఖరీదు చేయబోయే 114 రఫేల్ యుద్ధ విమానాల విషయంలో భారత ప్రభుత్వం ఆ కంపెనీకి కొన్ని షరతులు పెట్టినట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలుస్తోంది. కచ్చితంగా ఆ షరతుల్ని అమలు చేయాలని కంపెనీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగాలన్న నియమాన్ని పెట్టినట్లు తెలుస్తోంది.
భారతీయ ఆయుధాలు, మిస్సైళ్లు, మందుగుండు సామాగ్రిని 114 యుద్ధ విమానాలకు జోడించాలని భారత ప్రభుత్వం డసాల్ట్ కంపెనీని ఆదేశాలు ఇచ్చింది. దీనిలో భాగంగా సెక్యూర్టీ ఉన్న డేటా లింకులను ఆ కంపెనీ అందివ్వాల్సి ఉంటుంది. భారతీయ రేడార్లు, సెన్సార్లతో డిజిటల్ ఇంటిగ్రేషన్ అయ్యే రీతిలో కొత్త రఫేల్ విమానాలను తయారు చేయాలని ప్రభుత్వం తన షరతుల్లో పేర్కొన్నది. భారత్ విధించిన షరతుల వల్ల డసాల్ట్ కంపెనీ తన యుద్ధ విమానాల ఆన్‌బోర్డు కంప్యూటి సిస్టమ్ కోసం సాఫ్ట్‌వేర్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది.
టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు సహకరించాలని కూడా ఆ షరతుల్లో ఉన్నది. ఇంజిన్ తయారీ సంస్థ సఫ్రాన్,యేవిషన్ థేల్స్ దీనిలో భాగం కానున్నాయి. 2015లో 36 రఫేల్ విమానాలను ఐఏఎఫ్ కొనుగోలు చేసింది. అవియానిక్స్, వెపన్స్,మిస్సైల్ కోసం రఫేల్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ఎఫ్3ఆర్ వర్షన్‌ను వాడుతున్నారు. ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్ దీన్ని వినియోగిస్తున్నది. తాజాగా ఎఫ్4 వర్షన్‌ను డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ రిలీజ్ చేసింది. అయితే ఎప్-4, ఎఫ్-5 వర్షన్‌ను మిక్స్ చేసి కొత్త రఫేల్‌ను తయారు చేయాలని ఇండియా కోరుతున్నది.
114 రఫేల్స్ కోసం రక్షణ శాఖ సుమారు 8 బిలియన్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలుస్తున్నది. భారతీయ వాయు శక్తిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ అడుగు వేస్తున్నారు. మేకిన్ ఇండియా స్కీమ్‌లో కొత్త జెట్లను తయారు చేయనున్నారు. రిలయన్స్‌తో కలిపి డసాల్ట్ కంపెనీ కొత్త వెంచర్ ప్రారంభించింది. ప్రస్తుతం భారత్ వద్ద 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇలాంటి వేరియంట్‌కు చెందిన మరో 26 కొత్త విమానాలకు నేవీ ఆర్డర్ ఇచ్చింది.
అంబాలా ఎయిర్ బేస్‌లో రఫేల్ మెయింటేనెన్స్, రిపేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ ఇంజిన్ కంపెనీ సఫ్రాన్..ఇంజన్ల తయారీ కోసం ఎంఆర్వో కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు గతేడాది పేర్కొన్నది. భారత్‌లో వైమానిక దళంలో యుద్ధ విమానాల సంఖ్యను పెంచాల్సి అవసరం చాలా ఉన్నది. ప్రస్తుతం స్క్వాడ్రన్ల సంఖ్య 29కు చేరుకున్నది. గత ఆరు దశాబ్ధాలతో పోలిస్తే ఆ వైమానిక దళ శక్తి చాలా తక్కువ అని అంచనా వేస్తున్నారు.