కరీంనగర్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : దళితబంధు యూనిట్ల పంపిణీ జాతరను తలపించింది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదికగా మంగళవారం యూనిట్ల గ్రౌండింగ్ పండుగలా సాగింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 393 మంది దళితులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ 38 కోట్ల విలువైన 202 యూనిట్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి వారు వాహనాలను అందించారు. గ్రూపుతోపాటు వ్యక్తిగత యూనిట్లను అందించడంతో లబ్ధిదారులు ఆనందంలో మునిగిపోయారు. కూలీ నాలీ చేసుకునే తమకు ఇక శాశ్వత ఉపాధి దొరుకుతుందని భరోసాగా చెబుతున్నారు. దళితబంధుతో సీఎం కేసీఆర్ తమ తలరాతలు మారుస్తున్నాడని, ఆయనకు జన్మంతా రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.
ట్రాన్స్‌పోర్టును మెరుగు పర్చుకుంట..
హుజూరాబాద్ మండలం చిన్నపాపయ్యపల్లికి చెందిన రొంటాల మహేందర్‌కు ఇప్పటికే హెచ్ఎంటీ పేరిట ఒక ట్రాన్స్‌పోర్టు ఉంది. దళితబంధులో మరో ట్రాలీ ఆటో తీసుకున్న మహేందర్ ఇప్పుడు తన ట్రాన్స్‌పోర్టును మరింత మెరుగుపర్చుకుంటానని చెబుతున్నాడు. ఆటో ట్రాలీకి 6.70 లక్షలు ఖర్చయ్యాయని, మిగిలిన డబ్బుతో తన భార్యతో శారీ సెంటర్ పెట్టిస్తానని చెబుతున్నాడు. దళితబంధు కింద సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ ట్రాలీ ఆటోతో తమ కుటుంబం మరింత మెరుగుపడుతుందన్న ఆత్మవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ తల్లీకూతుళ్లు ఇపుడు జేసీబీ ఓనర్లు..
జమ్మికుంటకు చెందిన మంద పవన్ కల్యాణ్, ఈయన తల్లి మంద భాగ్యలక్ష్మి, జమ్మికుంట పక్కనే ఉన్న సైదాబాద్‌కు చెందిన పవన్ అక్కలు బండ లావణ్య, మరపల్లి సునీత గ్రూప్‌గా దళిత బంధులో జేసీబీ తీసుకున్నారు. వీళ్లంతా నిన్నా మొన్నటి వరకు భవన నిర్మాణ పనులు చేసుకుని జీవించే సాధారణ దళితులు. ఇప్పుడు ఒక జేసీబీ, ట్రాక్టర్‌కు ఓనర్లయ్యారు. పవన్ కల్యాణ్‌కు జేసీబీ ఆపరేటర్‌గా పదేండ్ల అనుభవం ఉన్నది. ఈ వాహనాలతో తమ బతుకులు పూర్తిగా మారిపోతాయనే ఆత్మవిశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వరినాటు యంత్రాలు వీళ్ల సొంతం
వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన దరిపెల్లి రజిత, కొయ్యడ రేణుక, కొయ్యడ భాగ్యలక్ష్మి ఈ ముగ్గురు కలిసి రెండు వరినాటు యంత్రాలను కొనుగోలు చేసుకున్నారు. తమ గ్రామానికి తమిళనాడు నుంచి వచ్చి వరి నాట్లు వేసి వెళ్తున్నారని, ఇప్పుడు తమ ఊరిలో మొదటి సారిగా తామే వరి నాటు యంత్రాలు కొనుగోలు చేసుకున్నామని చెబుతున్నారు. దళిత బంధుతో తమ బతుకులు మారిపోతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.