Greenland | గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా అధీనంలోకి తీసుకోవడం వెనుక డోనాల్డ్ ట్రంప్ ఉద్దేశాన్ని వైట్‌హౌస్ బయటపెట్టింది. గ్రీన్‌ల్యాండ్‌ను ఆధీనంలోకి తీసుకోవడం దేశ భద్రతకు అత్యంత అవసరమని ట్రంప్ భావిస్తున్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ వెల్లడించారు. ” ప్రెసిడెంట్ చాలా క్లియర్‌గా ఉన్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. ఇది మన దేశ భద్రతకు అవసరమని ఆయన నమ్ముతున్నారు.” అని తెలిపారు.
గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకునే ప్రతిపాదనను ఇప్పటికే డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ ఆర్కిటిక్ ప్రాంతంలో అమెరికా భద్రతపై చర్చించేందుకు వాషింగ్టన్‌తో కలిసి ఉన్నతస్థాయి వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కరోలిన్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి కారణంగా ఇరాన్లో 800 మంది నిరసనకారులపై అమలు చేయాల్సిన ఉరిశిక్షలను నిలిపివేశారని కరోలిన్ లివిట్ వెల్లడించారు. ” నిరసనకారుల హత్యలు కొనసాగితే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ 800 మంది ఉరిశిక్షలను నిలిపివేసింది” అని కరోలిన్ లివిట్ తెలిపారు.