Dhanush – Mrunal |కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్లో ‘సీతారామం’తో భారీ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి సోషల్ మీడియా, సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇటీవల వీరిద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారని, రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు తమిళ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తూ, ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రచారాలు జరగడం తొలిసారి కాదు. గతంలోనూ ధనుష్, మృణాల్ మధ్య ప్రేమాయణం ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఈ గాసిప్స్ ని మృణాల్ ఠాకూర్ ఖండించారు. అయినా తాజా పరిణామాలతో ఈ రూమర్స్ మరోసారి బలంగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా మృణాల్ సినిమా ఈవెంట్స్‌కు ధనుష్ హాజరవడం, అలాగే ఆయన కుటుంబ సభ్యులను మృణాల్ సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం వంటి అంశాలు ఈ వార్తలకు కారణంగా మారాయి. ఈ మొత్తం ప్రచారం మధ్య ఇప్పటివరకు ధనుష్ గానీ, మృణాల్ ఠాకూర్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా? లేక నిజంగా ఏదైనా కీలక ప్రకటన రానుందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ధనుష్‌కు గతంలో వివాహం జరిగింది. ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట 2024లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. విడాకుల అనంతరం ధనుష్ పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం ధనుష్ కెరీర్ పీక్స్‌లో ఉంది. ఇటీవల తెలుగులో ‘కుబేర’ చిత్రంలో నటించి తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఇక మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి వచ్చి ‘సీతారామం’తో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా నిలిచారు. తక్కువ సినిమాలే చేసినప్పటికీ మంచి ఇమేజ్ సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం అడివి శేష్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమాలో హీరోయిన్గా కనిపించనున్నారు. ధనుష్–మృణాల్ మధ్య నడుస్తున్న ఈ ప్రచారం నిజమా కాదా అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ గాసిప్స్‌గా మాత్రమే చూడాల్సి ఉంటుంది. అయినా, కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు మాత్రం నిజం ఏంటో త్వరలోనే బయటపడుతుందని ఆశిస్తున్నారు.