కార్పొరేషన్, మార్చి 8 : మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నప్పుడే సమాజం సంతోషంగా ఉంటుందని చెప్పారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తేనే కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర మేయర్ వై సునీల్‌రావు అధ్యక్షతన మంగళవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు.
మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ఆడబిడ్డలకు అన్ని విధాలా అండగా ఉంటున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను మహిళల పేరిటే అందిస్తున్నారని గుర్తు చేశారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, మహిళలు రాజకీయంగా మరింత ముందుకు రావాలన్నారు. ఇక నుంచి తన చాంబర్‌కు వినతుల కోసం మహిళా ప్రజాప్రతినిధులు లేకుండా వారి భర్తలు వస్తే అనుమతించేది లేదన్నారు. కచ్చితంగా మహిళా ప్రజాప్రతినిధులే నేరుగా స్థానిక సమస్యలపై విన్నవించేందుకు రావాలని, అలాంటి వారికే అనుమతి ఇస్తానని హామీ ఇచ్చారు.
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య పనులు చేస్తున్న మహిళలు ఉదయం నాలుగు గంటలకే లేచి ఇంట్లో పనులు పూర్తి చేసుకొని ఐదు గంటలకల్లా విధులకు హాజరు కావడం, ఇతర ఉద్యోగినులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వర్తిస్తూనే ఇంటి పనులు కూడా చేయడం గర్వకారణం అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతారని చెప్పటానికి ఇది నిదర్శనం అన్నారు. నగర మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, మహిళలు లేనిదే ఈ ప్రపంచమే లేదన్నారు. ఓర్పు, సహనంలో వారికి ఎవ్వెరు పోటీ రాలేరని, అలాంటి వారు అన్ని రంగాల్లోనూ సమానంగా ముందుంటారని తెలిపారు. అనంతరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, ఎంపీపీలు లక్ష్మయ్య, పిల్లి శ్రీలత, జడ్పీటీసీలు పురమల్ల లలిత, పిట్టల కరుణ, మహిళ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులకు చీర పెట్టి సత్కారం
మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులందరికీ చీర పెట్టి ఘనంగా సన్మానించారు. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌ను శాలువాతో సత్కరించారు. డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులందరికి మంత్రి సొంతంగా చీర పెట్టి, వారి భర్తల చేతుల మీదుగా ఆ మహిళలకు సన్మానం చేయించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్ తమకు తోడబుట్టిన వ్యక్తిగా చీరలు పెట్టి సత్కరించడం ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. అలాగే తమ భర్తల చేతులతో తమకు సన్మానం చేయించడంపై హర్షం వ్యక్తం చేశారు.