మార్చి నెలాఖరులోగా దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ సహా సంబంధిత శాఖల అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్తున్నారు. దళితబంధు యూనిట్‌తో లబ్ధిదారుడు ఏ విధంగా ఉపాధి పొందుతాడు… వారికున్న నైపుణ్యం, ఇతర అనుభవాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ పథకంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులు ఎంపిక చేసుకుంటున్న యూనిట్లలో కార్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వంటి వాహనాలే అత్యధికంగా ఉన్నాయి. వాహనాల తర్వాత వ్యవసాయ ఆధారిత యూనిట్లు, పాడి పరిశ్రమ, కిరాణా దుకాణాలు, మెడికల్ షాపులు, గొర్రెలు, మేకలు వంటి పశు పోషణపైనా ఆసక్తి చూపుతున్నట్లుగా తేలింది. ఎలాంటి ముందస్తు సహకారం అవసరమో అధికారులు గుర్తిస్తున్నారు. నిజామాబాద్ కలెక్టర్ నేరుగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సమగ్రంగా పరిశీలన చేస్తున్నారు. పథకం ఉద్దేశాన్ని వివరిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.
నిజామాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కార్లు… ట్రాక్టర్లు… హార్వెస్టర్లు… దళితబంధు పథకంలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఎంపిక చేసుకుంటున్న యూనిట్లలో వాహనాలే అత్యధికంగా ఉన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన ప్రతి వంద మందిలో ఎక్కువ మంది వీటిని ఎంచుకున్నట్లుగా యంత్రాంగం గుర్తించింది. వాహనాల తర్వాత వ్యవసాయ ఆధారిత యూనిట్లు, పాడి పరిశ్రమ, కిరాణ దుకాణాలు, మెడికల్ షాపులు, గొర్రెలు, మేకలు వంటి పశు పోషణపైనా ఆసక్తి చూపుతున్నట్లుగా తేలింది. మార్చి నెలాఖరులోగా గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌తో సహా సంబంధిత శాఖల అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్తున్నారు. వారి జీవన విధానాన్ని, స్థితిగతులను తెలుసుకుంటున్నారు. స్వయం ఉపాధిలో సక్సెస్ అయ్యేందుకు వారికున్న నైపుణ్యాన్ని, ఇతర అనుభవాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. వారు ఎంచుకున్న యూనిట్‌తో దళితబంధు లబ్ధిదారుడు ఏ విధంగా సక్సెస్ అయ్యే వీలుంది. ఎలాంటి ముందస్తు సహకారం అవసరమో అధికారులు గుర్తిస్తున్నారు. ఈ మేరకు సహాయ, సహకారాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేస్తున్నారు.
వాహనాలే అత్యధికం…
దళితబంధు పథకంలో భాగంగా ఎంపికైన లబ్ధిదారులు ఇప్పటికే తమకున్న నైపుణ్యం, అనుభవాన్ని అనుసరించి ఏ యూనిట్ స్థాపించాలనే ఆలోచనకు వచ్చారు. ఇందులో క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తున్న అధికారులకు తమ అభిప్రాయాలను లబ్ధిదారులు ఇదివరకే వెల్లడించారు. ఇందులో ఎక్కువ మంది రూ.10లక్షలు విలువ చేసే కారు, ట్రాక్టర్ కొనుగోళ్లకు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. వీటి ద్వారా నెలకు రూ.30వేలు నుంచి రూ.40వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం రవాణా శాఖ అధికారులతో లబ్ధిదారులను అటాచ్ చేస్తున్నారు. డ్రైవింగ్‌లో మెరుగైన శిక్షణ ఇప్పించడం, భవిష్యత్తులో వారికి అండగా నిలిచేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న వారు ట్రాక్టర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ పనుల్లో వీటి వాడకం ద్వారా ఉపాధి పొందొచ్చని వీరి ఆలోచన. సమూహంగా ఏర్పడిన వారిలోనూ వాహనాలే ముందు వరుసలో ఉంటున్నాయి. ఐదారుగురు లబ్ధిదారులు కలిసి ఉమ్మడిగా హార్వెస్టర్ కోసం దరఖాస్తు చేసిన వాళ్లు కూడా నిజామాబాద్ జిల్లాలో ఉండడం విశేషం. హార్వెస్టర్‌తో పంట కోత ద్వారా అధిక రాబడిని సాధించే వెసులుబాటు దక్కుతుంది.
అతి త్వరలోనే నగదు జమ…
దళితబంధు పథకం కింద ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వమే వంద శాతం రాయితీతో రూ.10లక్షలు అందిస్తున్నది. లబ్ధిదారుడు పైసా పెట్టుబడి లేకుండానే వారి బతుకుల్లో వెలుగులు అందించాలనే ఉద్దేశంతో మహత్తర పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. హుజూరాబాద్ వంటి నియోజకవర్గంలో దళిత కుటుంబాలకు ఈ పథకం దరిచేరడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దళిత కుటుంబాలకు నెలకు కుటుంబ అవసరాలు పోనూ తమకు తాముగా బలంగా నిలబడే శక్తి ఈ పథకంతో చేకూరింది. అలాంటి ప్రయోగమే రాష్ట్రమంతటా దళిత కుటుంబాలకు కల్పించాలని సర్కారు భావించింది.
ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో 100 మందిని ఎంపిక చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మొత్తం 900 మందిని గుర్తించారు. జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా మండలం మొత్తం దళితబంధు వర్తింపజేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఫలితంగా ఇక్కడ 1800 మందికి ప్రయోజనం చేకూరబోతున్నది. ఇలా ఉమ్మడి జిల్లాలో 2700 మందికి ఈ పథకం ద్వారా లాభం జరుగబోతున్నది. వీరికి మార్చి నెలాఖరు లేదంటే ఏప్రిల్ మొదటి వారంలోగా పది లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమఅవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఒకరు లేదంటే భాగస్వామ్యం…
తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకంలో సడలింపులు ఇవ్వడం లబ్ధిదారులకు కలిసి వస్తున్నది. ఇంతకు ముందు ఒక్కరికి రూ.10లక్షలతో ఒక్కో యూనిట్ గ్రౌండింగ్ చేసే పరిస్థితి లేకపోతే భాగస్వామ్యంతో చేపట్టే విధంగా మరో అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా లబ్ధిదారులు కొంత మంది కలిసి భారీ యూనిట్‌ను స్థాపించుకునే వెసులుబాటు కలిగింది. ఎంపిక చేసిన లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో రూ.10లక్షల జమ కాగానే దళితబంధు పథకంలో భాగంగా ఇప్పటికే ఎంపిక చేసుకున్న యూనిట్‌ను కొనుగోలు చేస్తారు. కుటుంబాలకు నేరుగా నిధులు ఇవ్వడం కాకుండా వారితో స్వయం ఉపాధి యూనిట్లను నెలకొల్పుకునేందుకు వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబ యజమాని చేస్తున్న పని ఏమిటి? అతను అందులో రాణించాలంటే ఆర్థిక సహాయం చేస్తే సరిపోతుందా? అనే అంశాలను ఆరా తీస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గడిచిన వారం రోజులుగా రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులను వెంటేసుకుని జిల్లా అంతటా కలియ తిరుగుతున్నారు. దళిత కుటుంబాల చెంతకు వెళ్లి స్వయంగా వివరాలు ఆరా తీస్తున్నారు. వారికి సలహాలు, సూచనలు అందిస్తూ ఆత్మైస్థెర్యం నింపుతున్నారు.