Jaipal Yadav | కడ్తాల్, ఫిబ్రవరి 15: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫమైందని విమర్శించారు. శనివారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో కలిసి, ఈ నెల 18న అమనగల్లు పట్టణంలో నిర్వహించనున్న రైతు దీక్షకు సంబంధించిన సన్నాహాక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, గద్దెనెక్కిన తర్వాత హామీలను అటకెక్కించిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షాల నాయకులను ఇబ్బందులకు చేసి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ప్రభుత్వం ముందు ఉన్నదని విమర్శించారు. చాలా గ్రామాల్లో రైతులకు రుణమాఫీ జరగలేదని, రైతు భరోసా అందలేదని పేర్కొన్నారు.
హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని జైపాల్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు ఆక్రోశంగా ఉన్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కలిసికట్టుగా ఉండి సత్తా చాటలన్నారు. అదే విధంగా మంగళవారం అమనగల్లు పట్టణంలో నిర్వహించనున్న రైతు దీక్షలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు. దీక్షకు నియోజకవర్గంలోని నాయకులు, అన్నదాతలు, రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీథ మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ జడ్పీటీసీలు దసరత్ నాయక్, అనురాధ, విజితారెడ్డి, మాజీ ఎంపీపీలు నిర్మల, శ్రీనివాసయాదవ్, రాంరెడ్డి, జైపాల్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు రమేశ్, శంకర్, విజయ్ గౌడ్, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్ యాదవ్, గ్రామాధ్యక్షుడు రామకృష్ణ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు. మాజీ రైతు సమన్యయ సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.