ఖలీల్‌వాడి, జూన్ 25 : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేసి ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దామని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యాని పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్‌గా ఇచ్చారని విమర్శించారు.
2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదని, అబద్ధాలు ఆడడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటైందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని అబిడ్స్ జీపీవో వద్ద బుధవారం పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదన్నారు. కేసీఆర్ దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చిందని తెలిపారు. తెలంగాణ వచ్చింది కాబట్టే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారని, అది మరిచిపోయి మాట్లాడడం బాధాకరమన్నారు.
రేవంత్‌రెడ్డి హుందాగా వ్యవహరించాలని, కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. సోనియాగాంధీ ముఖం చూసి ఓట్లేసిన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులను మోసం చేశారని మండిపడ్డారు. అందుకే సోనియాగాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపించినట్లు తెలిపారు. పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని రేవంత్‌రెడ్డికి ఆదేశాలివ్వాలని సోనియాగాంధీని కోరినట్లు పేర్కొన్నారు.