హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ అపూర్వ సృష్టిగా నిర్మాణమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్దేశిత లక్ష్యం దిశగా పరుగులు తీస్తున్నదని కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ, ఈఎన్సీ హరిరాం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ముఖచిత్రాన్ని, సాగునీటి కోసం తండ్లాడిన రైతుల తలరాతల్ని పూర్తిగా మార్చివేసిందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల కాళేశ్వరం ప్రారంభమై మూడేండ్లు పూర్తయిన సందర్భంగా ఈఎన్సీ హరిరాం ప్రాజెక్టుపై తన అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణతో పంచుకొన్నారు.
సీఎం కేసీఆర్ అపూర్వ సృష్టి కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణకు గొప్ప వరం. 7 లింకులు, 28 ప్యాకేజీలలో భాగంగా మేడిగడ్డ నుంచి బస్వాపూర్ వరకు అంటే లింక్ 1,2,4,5 పనులన్నీ పూర్తయ్యాయి. గంధమల్ల మినహా రిజర్వాయర్లన్నీ అందుబాటులోకి వచ్చాయి. అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సీజన్లోనే ఎగువ మానేరుకు గోదావరి జలాలను తరలిస్తాం. లింక్ 6లో మల్లన్నసాగర్ నుంచి సింగూరు వరకు ప్రధాన కాలువ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్యాకేజీ 19లో పంప్‌హౌస్ మాత్రమే నిర్మించాల్సి ఉన్నది.
టన్నెల్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. లింక్ 7 లో ఎస్సారెస్పీ నుంచి భూంపల్లి వరకు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలో సారంగాపూర్ పంప్‌హౌస్ ట్రయల్న్ నిర్వహిస్తాం. మాసని ట్యాంక్ పూర్తయింది. అక్కడి నుంచి ప్యాకేజీ 21లో భాగంగా చేపట్టిన పనులూ పూర్తయ్యాయి. నిజాంసాగర్ కాల్వలోకి, కొండెం చెరువులోకి నీటిని తరలిచేందుకు సర్వం సిద్ధమైంది. అక్కడి నుంచి భూంపల్లి రిజర్వాయర్ వరకు చేపట్టాల్సిన ప్యాకేజీ 22 పనులు, పంప్‌హౌస్ పనులు కొనసాగుతున్నాయి. మొత్తంగా మరో ఏడాదిలోగా కాళేశ్వరం ప్రాజెక్టులోని పనులన్నీ పూర్తవుతాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం దిశగా పరుగులు తీస్తున్నది. దాదాపు 147టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ప్రాజెక్టు ఉనికిలోకి రాకముందు 35 లక్షల వ్యవసాయ మోటర్లు ఉండేవి. సుమారు 7 వేల మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగేది. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్తు వినియోగం 3.5 మెగావాట్లకు మించడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్టు ద్వారా ఆశించిన, ఊహించిన దానికి మించి ఫలితాలు ఇప్పటికే అనుభవంలోకి వస్తున్నాయి. తెలంగాణ ప్రగతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇరుసుగా నిలువనున్నది.
ఒక గజ్వేల్ టెరిటోరియల్ పరిధిలోనే 770 చెరువులను అనుసంధానించాం. మరో 1300 పైగా చెరువులను అనుసంధాన ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రాజెక్టు మొత్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 వేలకు పైగా చెరువులు లింక్ కానున్నాయి. అవి ఏడాది పొడవునా నీటికళతో ఉట్టిపడతాయి.
ప్రాజెక్టు నిర్వహణకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయించారు. పంప్‌హౌస్‌లు, జలాశయాలు, కాల్వలు, చెరువులు, వర్షపాతం వివరాలు, నదుల ఇన్‌ఫ్లో, భూగర్భ జలాల పరిస్థితి తదితర సమాచారమంతా ఒకేచోట లభ్యమవుతుంది. రిజర్వాయర్లలోకి వచ్చే, కిందికి విడుదలచేసే నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు అంచనావేసేలా డిజైన్ చేశారు. జలాశయాల్లో, చెరువుల్లో ఎంత నీరున్నది? ఎంత ఖాళీ ఉన్నదన్న సమాచారాన్నీ తెలుసుకోవచ్చు.
ఈ సాఫ్ట్‌వేర్‌కు అవసరమయ్యే సమాచారాన్ని సేకరించడానికి అన్ని ప్రధాన నదుల మీద, ప్రాజెక్టులు, పంప్‌హౌస్‌ల సమాచారాన్ని విశ్లేషించేందుకు, నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రీకృత వ్యవస్థను, మూడు లోకల్ కమాండ్ సెంటర్లను, సెన్సర్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రాజెక్టు ఇంజినీర్లు మొబైల్ యాప్ ద్వారా ఇచ్చే సమాచారానికి అదనంగా భారత వాతావరణశాఖ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అందించే వాతావరణ సమాచారాన్ని, భూగర్భ జలశాఖ ఇచ్చే సమాచారాన్ని కూడా ఈ సపోర్ట్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఇది అంతిమంగా జలాశయాలు, పంప్‌హౌస్‌లను సమర్థంగా నిర్వహించేందుకు ఉపయోగడుతుంది.
ఉమ్మడి పాలనలో గోదావరిపై నిర్మించిన అతిపెద్ద రిజర్వాయర్ ఎస్సారెస్పీ ఉనికిలోకి రాకుండానే ప్రశ్నార్థకంగా మారింది. సగటున నాలుగేండ్లకు ఒకసారి కూడా ఎస్సారెస్పీ నిండని దుస్థితి నెలకొన్నది. దాని దిగువన ఎల్లంపల్లి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీఎం కేసీఆర్ 4 నెలల పాటు సుదీర్ఘ మేధోమథనం సాగించారు.
గూగుల్ ఎర్త్ మ్యాప్‌లతో గంటల కొద్దీ అన్వేషించి, తెలంగాణ భూభాగం స్వరూపానికి అనుగుణంగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. జలాశయాల నిర్మాణానికి అనువైన ప్రదేశాలను ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ దక్షత వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పురుడుపోసుకుంది. ఉనికి కోల్పోతున్న ప్రాజెక్టులన్నింటికీ ఊపిరి పోసింది. అన్నింటికీ ఆధారబిందువు కాళేశ్వరమే.
ఎలాంటి వాగు, నదితో సంబంధం లేకుండా నిర్మించిన తొలి ఆఫ్‌లైన్ రిజర్వాయర్ మల్లన్నసాగర్. సముద్రమట్టానికి 557అడుగుల ఎత్తులో నిర్మించిన అతిపెద్ద జలాశయం. 50 టీఎంసీల సామర్థ్యం కాగా ఇప్పటివరకు నిబంధనల మేరకు 16 టీఎంసీలతో నింపాం. శాండ్ ఫిల్టర్లు చక్కగా పనిచేస్తున్నాయి. ఈ జలాశయంనుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా గ్రావిటీ ద్వారానే నీటిని తరలించే సౌలభ్యమున్నది.
వ్యవసాయ అవసరాలతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారి శ్రామిక అవసరాలకు 16 టీఎంసీల నీరు ఈ రిజర్వాయర్ నుంచి ఏడాది పొడవునా సరఫరా కావాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ నుంచే దుబ్బాక, కొండపోచమ్మ, తపాస్‌పల్లి సింగూరు, నిజాంసాగర్‌కు నీటిని తరలించనున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టులో 62% మల్లన్నసాగర్ కిందనే ఉన్నది.