ఖిలా వరంగల్, నవంబర్ 05 : కాకతీయుల ఘన కీర్తి కలిగిన ఓరుగల్లు రాతికోట(Stone fort)ఉనికికి భారీ ముప్పు వాటిల్లింది. కోట సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు ఏ మాత్రం లేకపోవడంతో రాతికోట రోజు రోజుకు కాలగర్భంలో కలిసి పోతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల శతృదుర్భేద్యమైన రాతి కోట పశ్చిమ ద్వారం పైభాగంలో ఉన్న భారీ బండరాళ్లు కూలి కింద పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అసలే ఇరుకుగా ఉండే పశ్చిమ ద్వారం నుంచే ఎక్కువ సంఖ్యలో పర్యాటకుల వాహనాలు, అలాగే నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సులు, స్థానికులకు సంబంధించిన అనేక వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఇప్పుడు భారీ వర్షాల ధాటికి రాళ్లు రోడ్డుపై కుప్పలుగా పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పట్టించుకోని అధికారులు
చారిత్రక కట్టడం కూలుతున్నా, పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర పురావస్తు శాఖ నిమ్మకు నీరేత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కూలిన బండ రాళ్లను, మట్టిని తొలగించడానికి బల్దియా గాని లేదా కేంద్ర పురావస్తు శాఖ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఆయా శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది ద్వారం కింది నుంచే నిత్యం రాకపోకలు సాగిస్తూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్పా తక్షణ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శతృవులను అయోమయానికి గురి చేసే విధంగా కాకతీయులు నిర్మించిన రాతికోట సింహ ద్వారాలపై భారీగా పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో కోట బండ రాళ్లు కూలుతున్నాయని స్థానికులు ఆరోపించారు. కోటను పరిరక్షించాల్సిన పురావస్తు శాఖ కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుందని, చరిత్రను కాపాడటంలో ఘోరంగా విఫలమైందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రమాదంలో పర్యాటక ప్రాంతం
కాకతీయుల చరిత్రకు సజీవ సాక్షంగా నిలిచిన కోటను భారీ వర్షాల వల్ల ముప్పు వాటిళ్లుతోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ద్వారం కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తక్షణమే అధికారులు స్పందించి, కూలిన శిథిలాలను తొలగించి, ద్వారం మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోట మరింతగా దెబ్బతినకుండా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.