Sravan Dasoju : బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడంపై పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు. పార్టీ సీనియర్ నాయకురాలు కవిత గత కొన్ని నెలలుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కవిత అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.
పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావుకు వ్యతిరేకంగా కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారని శ్రవణ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి చోటుచేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లుగా కవిత వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అంతేగాక పార్టీ మరో నేత సంతోష్‌రావుకు వ్యతిరేకంగా కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పారు.
కవిత ఇలా క్రమం తప్పకుండా మీడియాలో పార్టీ నాయకత్వాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తుండటంతో లక్షల మంది కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని శ్రవణ్ అన్నారు. అందుకే పార్టీ అధినేత కేసీఆర్ ఆమెపట్ల కఠిన నిర్ణయం తీసుకున్నారని, కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు.