హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరంతోపాటు ఆ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంపై విచారణ ప్రారంభించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మరి కొందరు ఇంజినీర్లకు సమన్లు జారీచేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన క్వాలిటీ కంట్రోల్, ఓఅండ్ఎం తదితర విభాగాల ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు సమర్పించిన అఫిడవిట్లపై ఇప్పటికే బహిరంగ విచారణను పూర్తిచేసిన ఈ కమిషన్.. క్షేత్రస్థాయిలో పనిచేసిన మ రో 50 మంది ఇంజినీర్లను విచారణకు పిలవాలని నిర్ణయించినట్టు సమాచారం. సోమవారం నుంచి వారిని ప్రశ్నించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పూర్వ సెక్రటరీలతోపాటు ప్రస్తుత సెక్రటరీలను కూడా విచారించేందుకు కమిషన్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే అఫిడవిట్లు దాఖలు చేసిన రిటైర్డ్ ఇంజినీర్లు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, ఇతర వ్యక్తులను సైతం ఈ విచారణకు పిలవాలని కమిషన్ యోచిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ కమిషన్ ఇప్పటికే విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆ నివేదిక వివరాలను తె ప్పించుకునేందుకు సన్నాహాలు చేస్తున్న కమిషన్.. ఆర్థిక శాఖ అధికారులను సైతం విచారించాలని భావిస్తున్నది.
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మరో 26 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షీయల్ స్కూళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మొదటి విడతలో 28 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేసింది.