Karnataka | బెంగళూరు, సెప్టెంబర్ 6: కర్ణాటకలో మరో కుంభకోణం తెర మీదకు వచ్చింది. గత బీజేపీ హయాంలో కొవిడ్ నిర్వహణకు కేటాయించిన రూ.1,120 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైఖేల్ కన్హ కమిషన్ మధ్యంతర నివేదిక సమర్పించింది. దీంతో ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఉన్నతాధికారులతో కమిటీ
జస్టిస్ జాన్ మైఖేల్ కమిషన్ సమర్పించిన నివేదికను అధ్యయనం చేసి, తదుపరి చర్యలను సూచించాల్సిందిగా కోరుతూ కర్ణాటక ప్రభుత్వం ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని గడువు ఇచ్చింది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి విచారణను పూర్తి చేసేందుకు జస్టిస్ జాన్ మైఖేల్ కమిషన్ గడువును మరో ఆరు నెలలు పొడిగించింది.
ఆరోపణలు ఏమిటీ?
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మొదటిసారి లాక్డౌన్ విధించిన 2020 మార్చి నుంచి 2022 డిసెంబరు 31 వరకు కొవిడ్ నిర్వహణకు ఖర్చు చేసిన రూ.7,223 కోట్ల నిధుల్లో. రూ.1,120 కోట్ల దుర్వినియోగం జరిగిందని సిద్ధరామయ్య నియమించిన జాన్ మైఖేల్ కమిషన్ తెలిపింది. కాగా ముడా స్కామ్‌కు కౌంటర్ గానే సిద్ధూ ప్రభుత్వం దీనిని తెరపైకి తెచ్చిందని బీజేపీ ఆరోపిస్తున్నది.
నా భద్రతకు ముప్పుంది: కర్ణాటక గవర్నర్
అధికార కాంగ్రెస్ పార్టీ నేతల తీరు వల్ల తన భద్రతకు ముప్పు ఏర్పడిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, కేంద్ర హోం శాఖకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు తాను ఇచ్చిన అనుమతిని రాజకీయ పక్షపాతంతో కూడినదిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రాష్ట్ర మంత్రులు, నేతలు ఉద్దేశపూర్వకంగా “గో బ్యాక్ గవర్నర్” ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు.