న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలి: సీజేఐ జస్టిస్ రమణ
న్యూఢిల్లీ: కోర్టు తీర్పులు సమాజంపై విశేష ప్రభావం చూపిస్తాయని, అవి సరళంగా, స్పష్టంగా, సాధారణ భాషలో ఉండాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజలకు న్యాయసేవలు వేగంగా అందాలంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, సమగ్రతను కాపాడటం, ప్రోత్సహించడం కన్నా ముఖ్యమైనదేదీ లేదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను అన్ని స్థాయిల్లోనూ కాపాడాలన్నారు. ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టుల పనితీరు భారత న్యాయ వ్యవస్థ ఆత్మను, ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో జస్టిస్ రమణ మాట్లాడారు. ప్రజలు ఎక్కువగా ఆశ్రయించే ట్రయల్, జిల్లా కోర్టులు, హైకోర్టుల పనితీరు సున్నితంగా ఉండాలని, కోర్టులకు ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలని అన్నారు. కోర్టులు మానవీయ కోణంలో పనిచేయాలని సూచించారు. కింది స్థాయిలో కోర్టులు సమర్థంగా పనిచేయకపోతే జాతీయ స్థాయిలో ఆరోగ్యవంతమైన న్యాయవ్యవస్థను నిర్మించడం అసాధ్యం అని అభిప్రాయపడ్డారు. సంక్షేమ రాజ్య స్థాపనలో భారత న్యాయవ్యవస్థ ముందువరుసలో ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హైకోర్టుల జడ్జిలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు.