న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yashwant Varma)ను తొలగించే అంశంపై జడ్జీల ఎంక్వైరీ కమిటీ రూపొందించిన నివేదికను సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. జడ్జీల ఎంక్వైరీ చట్టం, 1968 ప్రకారం ఆ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఆ నివేదికను త్వరలోనే పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ సెక్రటేరియేట్ వర్గాలు తెలిపాయి. 2025 ఆగస్టు 12వ తేదీన జడ్జీల ఎంక్వైరీ కమిటీని స్పీకర్ బిర్లా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండోసారి ఏర్పాటు చేసిన కమిటీలో సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్ అరవింద్ కుమార్, బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ చంద్రశేకర్, కర్నాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య ఉన్నారు. అయితే గత ప్యానల్లో ఉన్న మద్రాసు హైకోర్టు సీజే మణింద్ర మోహన్ శ్రీవాత్సవ్ స్థానంలో జస్టిస్ చంద్రశేఖర్‌ను తీసుకున్నారు.
గత ఏడాది మార్చి 14వ తేదీన జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో సగం కాలిన నోట్ల కట్టలను గుర్తించిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన అలహాబాద్ హైకోర్టు జస్టిస్‌గా ఉన్న జస్టిస్ వర్మ రాష్ట్రపతి ముర్ముకు రాజీనామా సమర్పించారు. అయితే ఆ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఒకవేళ రాష్ట్రపతి ఆయన రాజీనామాను ఆమోదిస్తే, అప్పుడు జస్టిస్ వర్మకు తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటి వరకు ఆ జస్టిస్ యశ్వంత్ వర్మ వెల్లడించలేదు. దీంతో ఆయన తొలగింపు కోసం కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.