e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News సమాచార పరిరక్షణా, భక్షణా..?

సమాచార పరిరక్షణా, భక్షణా..?

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేండ్లలో ఒక వివాదం ముగిసిందనుకుంటే.. మరో వివాదాస్పద నిర్ణయం కొత్తగా ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. యావత్‌ రైతాంగం నిరసించిన వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తామని మోదీ ఈ మధ్యనే ప్రకటించారు. దీంతో ఒక వివాదం ముగిసింది. ఇంతలోనే ‘వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు’ పేరుతో మరో కొత్త వివాదం మొదలైంది.

‘వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు’పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సోమవారం సదరు బిల్లును ఆమోదించింది. ఈ నెల 29న మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. పేరుకే ఇది వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు అని.. లోపల అంతా ప్రభుత్వానికి విచక్షణారహితమైన అధికారాలను కట్టబెట్టే నిబంధనలున్నాయని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లు పూర్వాపరాలు ఏమిటో చూద్దాం.

- Advertisement -

స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రజల వ్యక్తిగత సమాచారం సోషల్‌మీడియా కంపెనీల వద్ద కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నది. ఆ కంపెనీలు ఆ సమాచారాన్ని ఉపయోగించి వినియోగదారులకు ఆన్‌లైన్‌ ప్రకటనలు పంపించటం వంటి కార్యకలాపాల ద్వారా లాభాలు మూటగట్టుకుంటున్నాయి. కానీ, ఆ సమాచారం లీక్‌ కావటం వంటి సమస్యలు తలెత్తినప్పుడు బాధ్యత వహించటం లేదు. 2017లో ‘జస్టిస్‌ కేఎస్‌ పుట్టస్వామి వర్సె స్‌ కేంద్రప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను (ప్రైవసీని) ఒక ప్రాథమిక హక్కుగా స్పష్టం చేసింది. పౌరుల ప్రైవసీని కాపాడేలా సమగ్రమైన సమాచార పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ నేతృత్వంలో కేంద్రం ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ జూలై 2018లో ‘వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు’ను ప్రతిపాదిస్తూ ముసాయిదాను రూపొందించింది. ఈ బిల్లును 2019లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం జేపీసీ పరిశీలనకు పంపించింది. కరోనా నేపథ్యంలో సంప్రదింపులు జరపటం కష్టమైనందున ఇప్పటివరకూ జేపీసీ పదవీకాలాన్ని ఐదుసార్లు పొడిగించింది. తుదిరూపంలో బిల్లును జేపీసీ ఇటీవల ఆమోదించింది.

బిల్లులోని అంశాలు

మధ్యవర్తులుగా వ్యవహరించని అన్ని సోషల్‌మీడియా వేదికలను (ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర కంపెనీలను) ఇకపై ప్రచురణకర్తలుగా భావించాలి. తమ వేదికపై (ప్లాట్‌ఫామ్‌పై) బహిరంగపరిచే వ్యక్తుల అభిప్రాయాలకు ఆయా సోషల్‌మీడియా కంపెనీలు బాధ్యత వహించాలి.
భారతదేశంలో తమ వేదికలను నిర్వహించుకోవాలనుకునే ప్రతీ సోషల్‌మీడియా కంపెనీ తమ ఆఫీసును భారత్‌లో ఏర్పాటుచేయాలి.
దేశాంతర చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధిపరచాలి. ఇది దేశీయ అవసరాలను తీర్చేవిధంగా ఉండాలి.
అన్నిరకాల డిజిటల్‌ ఉపకరణాల ధ్రువీకరణ కోసం ఒక ప్రత్యేకమైన ల్యాబొరేటరీని ఏర్పాటుచేయాలి.
ఖాతాదారుల వివరాలను సోషల్‌మీడియా కంపెనీలు చట్టబద్ధమైన కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాలి.
ఖాతాదారుల సమాచారాన్ని కంపెనీలు పరిరక్షించాలి. వారి ఫిర్యాదులను పరిష్కరించే యంత్రాంగాన్ని కంపెనీలు నెలకొల్పాలి.
నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై రూ.15 కోట్లు లేదా కంపెనీ ప్రపంచవ్యాప్త టర్నోవర్‌లో 4 శాతం (ఏది ఎక్కువైతే అది) జరిమానా విధిస్తారు.
పౌరుల, సంస్థల తాలూకు సమాచారాన్ని సేకరించటం, దాన్ని వినియోగించటంలో ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వ సంస్థలకు గానీ ఈ చట్టం నుంచి అన్ని మినహాయింపులు ఉంటాయి.

అభ్యంతరాలు ఏమిటి?

జేపీసీలో సభ్యులుగా ఉన్న ఏడుగురు ప్రతిపక్ష ఎంపీలు బిల్లులోని కొన్ని అంశాలపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తపరిచారు. ఈ మేరకు జేపీసీ సమావేశంలో తెలిపారు. అయినా ఖాతరు చేయకుండా జేపీసీ బిల్లును ఆమోదించింది.

బిల్లులోని 35వ క్లాజ్‌ ప్రకారం ‘దేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ, విదేశాలతో సంబంధాలు, దేశంలో శాంతిభద్రతల దృష్ట్యా.. ప్రభుత్వ సంస్థలు వ్యక్తిగత సమాచారం సేకరించినప్పుడు ఆ సంస్థలకు ఈ బిల్లులోని ఏ నిబంధనలూ వర్తించవు. ఈ క్లాజ్‌ ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు గా మారుతుందని విపక్షాల విమర్శ. మిగిలిన పరిస్థితుల మాట సరే గానీ.. ‘దేశంలో శాంతిభద్రతలు’ అన్న పదాన్ని తొలగించాలని వారు పట్టుబట్టారు. కానీ, బీజేపీ సభ్యులు మెజారిటీగా ఉన్న జేపీసీ అందుకు అంగీకరించలేదు.
బిల్లులోని మరో వివాదాస్పద అంశం క్లాజ్‌-12(ఏ). దీనిప్రకారం.. ప్రభుత్వం ఒక చట్టబద్ధమైన పని కోసం ఒక వ్యక్తి సమాచారాన్ని ఆ వ్యక్తి ఆమోదం లేకుండానే సేకరించవచ్చు. దీనిద్వారా ప్రభుత్వం పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛపై యథేచ్ఛగా ఆంక్షలు మోపే ప్రమా దం ఉన్నది.
బిల్లును వ్యక్తిగత సమాచార పరిరక్షణ అని చెప్తున్నప్పటికీ.. వ్యక్తిగతేతర సమాచారానికి కూడా వర్తించే విధంగా బిల్లులోని అంశాలున్నాయి. ఇది పూర్తిగా వేరే అంశం కాబట్టి.. దానిపై విడిగా మరొక చట్టం చేయాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
బిల్లులోని నిబంధనల అమలుకు సమాచార పరిరక్షణ అథారిటీని నియమించాలని బిల్లు చెప్తున్నది. ఈ అథారి టీ చైర్‌పర్సన్‌, సభ్యుల నియామకాన్ని కేంద్రం చేతుల్లో పెట్టింది. అంతేకాదు కేంద్రం ఆదేశాల మేరకు పనిచేయాలని స్పష్టం చేసింది. అంటే, ఈ సంస్థ స్వతంత్రంగా పని చేయటం వీలుకాదు. ఇది సీబీఐ, ఈడీ లాగా మరో కేంద్రప్రభుత్వ సంస్థగా మారిపోయే ప్రమాదం ఉన్నది.

కె.వి.రవికుమార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement