హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన అంటే నిర్బంధపాలనేనా అని రాష్ట్రసర్కార్ను మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్‌రావును ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు. రైతులకు అండగా హరీశ్‌రావు పరిగి వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇందిరమ్మ పాలనలో హౌస్ అరెస్టులు లేవంటూనే తనను కూడా పలుమార్లు అరెస్టు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో 1000పైగా గురుకులాలు ఏర్పాటు చేశామని, ఇవేమీ సీఎం, డిప్యూటీ సీఎంలకు కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. మెస్సీతో ఐదు నిమిషాల ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్ల సింగరేణి నిధులు సీఎం రేవంత్ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలైనట్టుగా నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి జోగు రామన్న సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు తనతో చర్చకు రావాలని సూచించారు. ‘మూడు నెలలకే పిల్లలు పుడుతారా? చిలుకపచ్చ చీరలతో చిలుకల్లా కనిపిస్తారు..’ అంటూ సీఎం హోదాలో రేవంత్ మహిళలను అవమానించారని మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం కాకుండా తన మనుమడి అక్షరాభ్యాసం కోసం మాత్రమే సీఎం బాసరలో పర్యటించారని పేర్కొన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు జిల్లా ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. అదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్కు పేరిట ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ దోపిడీ చేస్తున్నారని, ఆయనకు సీఎం సహకరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు జాన్సన్ నాయక్, లోక బాపురెడ్డి, కే కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.