న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ తేజం జివాంజీ దీప్తి వెండి వెలుగులు విరజిమ్మింది. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ మరోమారు ప్రతిష్టాత్మక టోర్నీలో భారత మువ్వన్నెల పతాకాన్ని దీప్తి సగర్వంగా రెపరెపలాడించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా శనివారం మొదలైన మెగాటోర్నీలో తొలి రోజు భారత అథ్లెట్లు అదరగొట్టారు. స్వర్ణం సహా రజతం, కాంస్యం కైవసం చేసుకుని సత్తాచాటారు. మహిళల 400మీటర్ల టీ20 ఫైనల్ రేసును భారత యువ అథ్లెట్ దీప్తి సీజన్ బెస్ట్ నమోదు చేస్తూ 55.16 సెకన్లలో పూర్తి చేసి రజతంతో మెరిసింది. ట్రాక్‌పై ఆఖరి వరకు ఆకట్టుకున్న దీప్తి టాప్-3లో నిలిచింది.
గత చాంపియన్‌షిప్‌లో ప్రపంచ రికార్డుతో పసిడి కొల్లగొట్టిన దీప్తి ఈసారి రజతానికి పరిమితమైంది. హీట్స్-2లో అగ్రస్థానంలో నిలిచిన దీప్తి తుది పోరులో అదే దూకుడు కొనసాగించలేకపోయింది. చివరి సెకన్ వరకు అగ్రస్థానం కోసం ప్రయత్నించిన దీప్తిని వెనుకకు నెడుతూ అసెల్ ఒండర్(తుర్కియే) 54.51సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం కైవసం చేసుకోగా, యులియా షులియర్(ఉక్రెయిన్, 56.29సె) కాంస్యం దక్కించుకుంది.
గత చాంపియన్‌షిప్‌లో ఎదురైన ఓటమికి ఒండర్ ఈసారి దీప్తిపై ప్రతీకారం తీర్చుకుంది. పురుషుల హైజంప్ టీ63 ఈవెంట్లో మన దేశానికి చెందిన శైలేశ్ కుమార్ పసిడి పతకంతో మెరువగా, వరుణ్సింగ్జ్రతం దక్కించుకున్నాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన హైజంప్ ఈవెంట్లో శైలేశ్ కుమార్ 1.91మీటర్లతో రికార్డు నెలకొల్పాడు. 1.60మీటర్లతో మొదలుపెట్టి క్రమంగా ఎత్తు దూకిన శైలేశ్ తొమ్మిదో ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఇదే విభాగంలో ఫ్రెచ్ (1.85మీ), వరుణ్‌సింగ్ (1.85మీ) రజత, కాంస్య పతకాలు గెలిచారు.