గ్వాంగ్జు(దక్షిణకొరియా): పారా ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆర్చర్ శీతల్‌దేవి కొత్త చరిత్ర లిఖించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన తొలి భారత ఆర్చర్‌గా శీతల్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల కాంపౌండ్ ఫైనల్లో జమ్ముకశ్మీర్‌కు చెందిన శీతల్‌దేవి 146-143తో ప్రపంచ నంబర్‌వన్, తుర్కియే ఆర్చర్ ఒజ్నుర్ కురె గిరిడిపై చారిత్రక విజయం సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఫైనల్లో శీతల్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. రెండు చేతులు లేకపోయినా మొక్కవోని ధైర్యం, ఆత్మవిశ్వాసంతో తుర్కియే ఆర్చర్‌కు చెక్ పెట్టింది. ఈ క్రమంలో ఆర్మ్లెస్ ఆర్చర్ అమెరికా సట్జ్మన్ పసిడి రికార్డును శీతల్ తాజాగా అధిగమించింది.
ఫైనల్ పోరులో…శీతల్, గిరిడి మధ్య తొలి రౌండ్ 29 పాయింట్లతో సమమైంది. అయితే రెండో రౌండ్లో మూడు సార్లు 10 పాయింట్లు దక్కించుకున్న ఈ యువ ఆర్చర్ 30-27 ఆధిక్యంలో నిలిచింది. ఇద్దరి మధ్య మూడో రౌండ్ 29తో సమం కాగా, నాలుగో రౌండ్లో శీతల్ కంటే గిరిడి ఒక పాయింట్ ఎక్కువ సాధించింది. అప్పటికే 116-114తో ఆధిక్యంలో ఉన్న శీతల్ ఆఖరి రౌండ్లో మూడు సార్లు 10 పాయింట్లతో పసిడిని ముద్దాడింది. అదే జోరు కొనసాగిస్తూ కాంపౌండ్ ఓపెన్ టీమ్ తుది పోరులో శీతల్, సరిత 148-152 తేడాతో తుర్కియే ద్వయంలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో తోమన్ 40-20తో రాకేశ్‌పై స్వర్ణం సొంతం చేసుకున్నాడు.