Jeevan Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం లేదని, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనీ నడుపుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోదరులు అనుముల తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కృష్ణారెడ్డి, భూపాల్ రెడ్డి డైరెక్టర్లు ఉన్నారని అన్నారు.
ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ నగరంతోపాటు, రంగారెడ్డి జిల్లాలోని భూములను ఆక్రమించుకుంటోదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. వాళ్లు తలుచుకుంటే ఏ భూమినైనా తమ సొంతం చేసుకుంటున్నారని విమర్శించారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడుతూ సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ముఖ్యమంత్రికి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.