JEE Main : జేఈఈ మెయిన్-2026 (JEE Main-2026) ఫలితాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో NTA అధికారులు సోమవారం ఉదయం ఫైనల్ కీ విడుదల చేశారు. ఏ క్షణంలోనైనా ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12 నాటికే జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేశారు.
ఫిబ్రవరి 16 లోపు ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. అయితే తాజాగా ఫైనల్ కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎన్టీఏ అధికారులు వెల్లడించిన ప్రకారమైతే ఏ క్షణంలోనైనా జేఈఈ మెయిన్-2026 ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఫలితాలు వెల్లడైన తర్వాత అభ్యర్థులు తమ రిజల్ట్స్ ను జేఈఈ మెయిన్ వెబ్సైట్ jeemain.nta.nic.in, ఎన్టీఏ వెబ్సైట్ nta.ac.in లలో చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలను ఎంటర్ చేసి స్కోర్ కార్డును పొందవచ్చు. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం జనవరి 21 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ తొలివిడత (పేపర్ 1, పేపర్ 2) పరీక్షలు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా పేపర్-1 (బీఈ/బీటెక్) కు దాదాపు 13.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో దాదాపు 95 శాతం మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి ఫిబ్రవరి 4న ప్రొవిజినల్ కీని విడుదల చేసిన అధికారులు.. ఈనెల 6 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. వాటి ఆధారంగా తాజాగా ఫైనల్ కీ విడుదల చేశారు.