హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : ఐఐటీల్లో సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను సజావుగా నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. అయితే, పరీక్షల్లో ఇచ్చిన ఫిజిక్స్ ప్రశ్నలు కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. ఉదయం నిర్వహించిన పేపర్-1తోపాటు మధ్యాహ్నం నిర్వహించిన పేపర్-2లోనూ ఫిజిక్స్ విభాగం ప్రశ్నల సాధనకు ఎక్కువ సమయం పట్టడంతో విద్యార్థులు టెన్షన్‌పడ్డారు. ఇక గణితం ప్రశ్నలు సైతం సుదీర్ఘంగా ఇచ్చినప్పటికీ మధ్యస్తంగా ఉన్నాయని, కెమిస్ట్రీ మాత్రం కాస్త సులభంగా ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు.
అడాన్స్‌డ్ పరీక్షలో రెండు పేపర్లుండగా ఒక్కో పేపర్ 180 మార్కులకు నిర్వహించారు. ఒక్కో సబ్జెక్టుకు నిరుడు 18 ప్రశ్నలివ్వగా, ఈసారి ఒక్కో సెక్షన్లో 16 చొప్పున మొత్తం 98 ప్రశ్నలిచ్చారు. పేపర్-1లో సెక్షన్-ఏ, సెక్షన్-సీ ఎక్కువ స్కోర్ చేసేవిగా, విద్యార్థులకు అనుకూలంగా ఉండగా, సెక్షన్-బీ, సెక్షన్-డీలో ఇచ్చిన ప్రశ్నలు మాత్రం కాస్త కఠినంగా, సమయం తీసుకునేవిగా ఉన్నట్టు శ్రీచైతన్య ఆలిండియా ఐఐటీ కో ఆర్డినేటర్ ఉమాశంకర్ విశ్లేషించారు. బీ, డీ సెక్షన్లలో ఇచ్చిన ప్రశ్నలే ర్యాంక్‌లను నిర్ధారిస్తాయని ఆయన తెలిపారు. పేపర్-2లో మంచి స్కోర్ చేసినవారు టాప్ర్యాంక్లు సాధిస్తారని చెప్పారు. ఈ నెల 21న రెస్పాన్స్ సీట్లు, 25న ప్రాథమిక కీ విడుదల చేయనుండగా, జూన్ 1న ఫలితాలు విడుదలకానున్నాయి.
