హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఇటీవల నిర్వహించిన టీజీఎప్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్లో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చిలుకానగర్ (ఉప్పల్)కు చెందిన ఎం రుషి 160కి 156 మార్కులతో ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ టాపర్‌గా నిలిచారు. హైదరాబాద్ జిల్లా ఆసిఫ్‌నగర్‌కు చెందిన విద్యార్థి ముఖర్రమ్ అహ్మద్ 160కి 150 మార్కులు సాధించి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం స్టేట్ టాపర్‌గా నిలిచారు. ఈ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను కేశవరావు, యోగితారాణా ఈ సందర్భంగా అభినందించారు. ఈసారి ఇంజినీరింగ్‌లో 73.36%, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 86.27% విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. వారంలో ప్రవేశాల షెడ్యూల్ విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ టీకేకే రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ప్రొఫెసర్ పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వరరావు, ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి, కో కన్వీనర్ ప్రొఫెసర్ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఫలితాల్లో అమ్మాయిలు.. టాప్ ర్యాంకర్లలో అబ్బాయిలు
ఫలితాల్లో ఈసారి బాలికలే పైచేయి సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో అమ్మాయిలు 73.72%, అబ్బాయిలు 73.10% చొప్పున క్వాలిఫై అయ్యారు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు 0.62% అధికంగా క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో అమ్మాయిలు 86.76%, అబ్బాయిలు 84.70% చొప్పున ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు 2.06% అధికంగా క్వాలిఫై అయ్యారు. అయితే ర్యాంకర్లలో మాత్రం బాలుర హవా సాగింది. ఇంజినీరింగ్ విభాగంలో టాప్-10 ర్యాంకర్లలో 8 మంది అబ్బాయిలు ఉండగా, ఇద్దరు అమ్మాయిలున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో టాప్ 10లో ఏడుగురు అబ్బాయిలుండగా, ముగ్గురు అమ్మాయిలున్నారు. టాపర్లల్లో అత్యధికులు గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన వారే కావడం గమనార్హం. ఇంజినీరింగ్‌లో ఏడుగురు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ఆరుగురు గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థులుండటం విశేషం. అయితే కొందరు ఏపీ విద్యార్థులు ఎప్‌సెట్‌లో సత్తాచాటారు. టాప్ -10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. అయితే, వీరికి అడ్మిషన్లు ఇవ్వబోమని అధికారులు ప్రకటించారు.
ఈ మార్కుల్లోపు వారికే.. పదివేల లోపు ర్యాంకు
ఈసారి ఎప్‌సెట్ ప్రశ్నలు అత్యంత కఠినంగా వచ్చినట్టు స్పష్టమవుతున్నది. ఏ ఒక్క విభాగంలోనూ 160కి నూట అరవై మార్కులు రాకపోవడం గమనార్హం. ఇంజినీరింగ్‌లో 10వేల లోపు ర్యాంకు 62 మార్కులకే కటాఫ్ కావడం గమనార్హం. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 66 మార్కులకు 10లోపు ర్యాంకు వచ్చింది. అంటే 90కి పైగా ప్రశ్నలను విద్యార్థులు ఛేదించలేకపోయారు. ఎప్‌సెట్‌లో పదివేల లోపు ర్యాంకు వచ్చిన వారికి రెండు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటే రిజర్వేషన్ క్యాటగిరీతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. ఇంజినీరింగ్ విభాగంలో గత మూడేండ్లతో పోల్చుకుంటే ఉత్తీర్ణతా శాతం ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది. 2025తో పోల్చితే 0.1% ఉత్తీర్ణతా శాతం మాత్రమే పెరిగింది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 1.55% ఉత్తీర్ణత తగ్గింది.

