హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అక్రమంగా మత్తు పదార్థాలు తయారు చేస్తూ, సరఫరా చేస్తున్న ఓ డ్రగ్స్ ముఠా గుట్టును నారోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు రట్టు చేశారు. ఈ దాడిలో భారీగా అల్ప్రాజోలం డ్రగ్‌తోపాటు రూ.85 లక్షలకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డులోని కాళ్లకుంట కాలనీ సమీపంలో నిఘా పెట్టారు. అనుమతి లేకుండా అక్రమంగా డ్రగ్స్ మార్పిడి జరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు రెండు కార్లను అడ్డుకొని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 39.470 కిలోల ఆల్ప్రాజోలం, రూ.85,36,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లోని మదీనాగూడకు చెందిన మరో వ్యక్తిని ఎన్సీబీ అరెస్టు చేసింది. సూత్రధారి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసి, ఫ్రీలాన్స్ కెమిస్ట్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌లోని ప్రశాంత్‌నగర్‌లో సొంత ల్యాబొరేటరీలోనే అల్ప్రాజోలం రహస్యంగా తయారుచేస్తున్నట్టు అతను అంగీకరించాడు. ఈ ముఠా సుమారు 150 కిలోల అల్ప్రాజోలం విక్రయించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.