Revanth Reddy | హైదరాబాద్, మే17(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం పొద్దున ఢిల్లీ వెళ్లారు. అదేరోజు రాత్రి తిరిగి హైదరాబాద్ వచ్చారు. అయితే, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమారుని పెండ్లి రిసెప్షన్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజులపాటు అక్కడే మకాం వేస్తారని సీఎంవో లీకులు వదిలింది.
రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షించే రెండు ప్రధాన ఎజెండాలతో ఆయన ఢిల్లీ వెళ్తున్నారని, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సాధించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే ఎజెండా ఒకటి, మంత్రివర్గ విస్తరణ, కీలక కార్పొరేషన్ల చైర్మన్ పదవుల భర్తీ, పార్టీ ప్రక్షాళన తదితర ప్రతిపాదనలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో ఆమోదముద్ర వేయించుకోవాలన్న రెండో ఎజెండాతో ఢిల్లీ వెళ్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు లీకులు వదిలింది. ముఖ్యమంత్రి వర్గం సైతం సోషల్‌మీడియా ఇదే ప్రచారం చేసింది. కానీ, ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కానీ, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ కానీ లేకుండానే సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అదేరోజు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంటకస్వామికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధినేత రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దొరికింది కానీ, రేవంత్‌రెడ్డిని మాత్రం కలువకపోవడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం సంగతి అటుంచితే, సొంత పార్టీ అధిష్ఠానం నుంచి ఏమైనా సాధించారా? అంటే అదీలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర క్యాబినెట్లో మొత్తం 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి సహా 16 మంది మంత్రులు ఉన్నారు. ఈ లెక్కన మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ కూర్పులో సామాజిక వర్గాల సమతుల్యత లేదనే విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇప్పటివరకు నిజామాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే లేదు. మరోవైపు కీలకమైన శాఖలు అన్ని సీఎం వద్దనే ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. కీలక కార్పొరేషన్ పదవులు పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చే నెలలో మరోకొన్ని కార్పొరేషన్ల చైర్మన్ల పదవీకాలం ముగుస్తుంది. వీటన్నింటి మీద స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీతో మాట్లాడి ఫైనల్ చేసుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర క్యాబినెట్లో కొందరు మంత్రుల పనితీరు సక్రమంగా లేదని, అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులతో పునర్వ్యవస్థీకరణ అంశంపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తుండగా, రాహుల్‌గాంధీ ప్రత్యేకించి ఈ విషయంలో ఒక్కసారి కూడా రేవంత్‌రెడ్డికి అవకాశం ఇవ్వలేదని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మంత్రివర్గానికి సంబంధించి ఏదీ ఉన్నా.. మీనాక్షీ నటరాజన్, లేదా మహేశ్కుమార్గౌడ్తోనే చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు ఇప్పటివరకు పరిగణనలోకి తీసుకోలేదని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
గడిచిన రెండున్నరేండ్లుగా సీఎం రేవంత్‌రెడ్డి 70 సార్లు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రులను కలిసి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు సమర్పించినట్టు, అప్పుడప్పుడు ప్రధానమంత్రిని కలిసి వివరించినట్టు సీఎంవో మీడియాకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం రాష్ర్టానికి చెందిన రూ.45 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్తున్నారు. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఏ ఒక్క రూపాయి కూడా తీసుకొనిరాలేకపోయారని అధికారిక నివేదికలు చెప్తున్నాయి. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టు అనుమతుల కోసమంటూ సీఎం రేవంత్‌రెడ్డి 30 నుంచి 40 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చి వచ్చారు. కానీ, ఈరోజు వరకు కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదు. తాజాగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మహారాష్ట్రలోని నాగపూర్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర క్యాబినెట్ పెద్దఎత్తున నిధులు కేటాయించింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా పరిధిలో 134 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టు, సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రోరైలు ఫేజ్-2 కింద తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రాజెక్టును కేంద్రం పట్టించుకోలేదు. 70సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రులను ఒప్పించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెనుకబడిన ప్రాంతాల జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం (బీఆర్జీఎఫ్) పథకం కింద తెలంగాణలోని 9 జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉండగా, కేంద్రం ఇవ్వలేదు. వీటిని సాధించడంలో సీఎం విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఇప్పుడీ ఈ సీమునే ఎత్తివేశారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఇలా దేనికీ కేంద్రం ఆర్థిక సహాయం అందించలేదు.