TGCHE | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ సహా ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎంట్రెన్స్ టెస్టుల్లో ‘ఆన్సర్ కీ చాలెంజ్’ చేస్తే ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజుగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇలా ఒక విద్యార్థి 10 ప్రశ్నల ఆన్సర్లను సవాల్‌చేస్తే అక్షరాలా ఐదు వేలు సమర్పించుకోవాల్సిందే. జాతీయంగా నిర్వహించే జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో ఆన్సర్ కీ చాలెంజ్‌లో ఒక్కో ప్రశ్నకు రూ. 200 మాత్రమే వసూలు చేస్తుండగా, మన దగ్గర మాత్రం రూ. 500 గుంజనున్నారు. ఒక వేళ ఎవరైనా విద్యార్థి 160 ప్రశ్నలను సవాల్‌చేయాలనుకుంటే ఏకంగా రూ. 80వేలు సమర్పించుకోవాల్సిందే. గతంలో ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తంచేసేందుకు ఫీజులు వసూలు చేసే విధానం ఇది వరకెప్పుడు మన దగ్గర లేదు. ఈసారి నుంచి తొలిసారిగా అమలుచేయాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించారు.
ఎప్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్ సహా 7ప్రవేశ పరీక్షల్లో ఈ విధానం అమలుచేయాలని నిర్ణయించారు. అయితే ఇది పూర్తిగా రీ ఫండబుల్ ఫీజు అని అధికారులు తెలిపారు. ఒక ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తంచేసిన పక్షంలో ఆన్సర్ తప్పు అని తేలితే విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అదే ఆన్సర్ మారకపోతే ఫీజు వాపస్ ఉండదు. ఈ విధానాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే ఈవిధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఉపసంహరించేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.