చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళను ఇవాళ చెన్నై పోలీసులు విచారించారు. 2017లో కొడనాడు ఎస్టేట్ బంగ్లాలో జరిగిన వరుస హత్యలు, దోపిడీల కేసుల్లో ఈ విచారణ జరిగినట్లు తెలుస్తోంది. చెన్నైలోని టీ నగర్లో ఉన్న శశికళ నివాసంలో ఈ విచారణ సాగింది. వెస్ట్ జోన్ ఐజీ ఆర్ సుధాకర్ నేతృత్వంలోని పోలీసుల బృందం ఇవాళ విచారణ చేపట్టింది. కొడనాడు ఎస్టేట్లో సెక్యూర్టీ గార్డ్ హత్య జరిగిన సమయంలో, ఆ తర్వాత బంగ్లాలో చోరీ జరిగిన సమయంలో శశికళ బెంగుళూరులో జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే అదే బంగ్లాలో మరో నలుగురు అనుమానాస్పద రీతిలో మృతిచెందంతో ఆ కేసు మరింత క్లిష్టంగా మారింది. గతంలో జయకు డ్రైవర్గా చేసిన కనకరాజ్ కారు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ రోజునే సాయన్ అనే వ్యక్తి కూడా ప్రమాదానికి గురయ్యాడు.ఎస్టేట్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకే కొడనాడు దొంగతనం, మర్డర్ కేసుల్లో విచారణ చేపడుతున్నట్లు ఇవాళ సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు.