Jaundice Diet | పచ్చ కామెర్లు వచ్చిన వారి శరీరం పసుపు రంగులో కనిపిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. కళ్లు కూడా పసుపు రంగులో దర్శనమిస్తుంటాయి. రక్తంలో బైలిరుబిన్ అనే సమ్మేళనం అధికంగా చేరడం వల్ల పచ్చ కామెర్లు వస్తాయి. ఇది పసుపు రంగులో ఉంటుంది కనుక శరీరం మొత్తం అదే రంగులోకి మారుతుంది. పచ్చ కామెర్లు వచ్చిన వారిని సులభంగా గుర్తించవచ్చు. ఈ క్రమంలోనే ఈ కామెర్లు ఉన్నవారు డాక్టర్లచే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి. దీంతో కామెర్ల నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకోవాలి. పచ్చ కామెర్లు ఉన్నవారు పలు ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా కోలుకుంటారు. శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. మళ్లీ చురుగ్గా పనిచేస్తారు. అలాగే శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి.
పచ్చ కామెర్లు ఉన్నవారి లివర్ పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. కనుక లివర్‌పై భారం పెంచని ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తినాలి. నూనె పదార్థాలు, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు. తాజా పండ్లు, కూరగాయలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. పచ్చ కామెర్లు ఉన్నవారు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారు శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. అందుకు గాను నీళ్లను అధికంగా తాగాల్సి ఉంటుంది. దీంతో ఆహారం కూడా సులభంగా జీర్ణం అవుతుంది. లివర్‌పై పడే భారం తగ్గుతుంది. శరీరంలోని వ్యర్థాలను లివర్ సులభంగా బయటకు పంపిస్తుంది. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీంతో వ్యాధి నుంచి సులభంగా కోలుకుంటారు. ఈ క్రమంలో పచ్చ కామెర్లు ఉన్నవారు రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల వరకు నీళ్లను తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది.
పచ్చ కామెర్లు ఉన్నవారు తాజా పండ్లు, కూరగాయాలను తింటుండాలి. వీటిని పోషకాలకు గనిగా చెబుతారు. వీటిని తినడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అన్ని రకాల పండ్లు, కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి. అయితే ద్రాక్ష, నారింజ, కివి, పైనాపిల్, యాపిల్, దానిమ్మ, నిమ్మ వంటి పండ్లతోపాటు టమటాలు, చిలగడదుంపలు, క్యారెట్లు, పాలకూర, బీట్ రూట్ వంటి కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక వీటిని రోజూ తింటుంటే పచ్చ కామెర్లు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ వ్యాధి నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
పచ్చ కామెర్లు ఉన్నవారు పలు ఎంజైమ్‌లు కలిగిన ఆహారాలను తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా జీర్ణాశయానికి అవసరం అయ్యే ఎంజైమ్‌లు కలిగిన తేనె, పైనాపిల్, బొప్పాయి, మామిడి వంటి ఆహారాలను, పండ్లను తింటుంటే ఫలితం ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణాశయానికి కావల్సిన ఎంజైమ్‌లు లభిస్తాయి. ఇవి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తాయి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీని వల్ల పచ్చ కామెర్లు త్వరగా తగ్గుతాయి. అలాగే ఈ వ్యాధి ఉన్నవారు రోజూ ఓట్స్, వాల్ నట్స్‌ను తింటున్నా కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. పచ్చ కామెర్లు ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వేపుళ్లను అసలు తినకూడదు. నూనె పదార్థాలు, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, మసాలాలు, కారం ఉండే ఆహారాలు, తీపి పదార్థాలను అసలు తినకూడదు. వీటిని తింటే లివర్‌పై భారం పడుతుంది. దీంతో లివర్‌లో కొవ్వు చేరి పచ్చ కామెర్లు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ వ్యాధి ఉన్నవారు ఆహారం విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. దీని వల్ల వ్యాధి నుంచి త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు.