Vitamin D Tablets | విటమిన్ డి మనకు సూర్యరశ్మి ద్వారా లభిస్తుందన్న విషయం తెలిసిందే. రోజూ కాసేపు ఎండలో నిలుచుంటే ఈ విటమిన్‌ను చాలా సులభంగా పొందవచ్చు. పూర్వం ప్రజలు రోజూ ఎండలో శారీరక శ్రమ అధికంగా చేసేవారు. కనుకనే వారికి విటమిన్ డి లోపం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనుషుల శరీరానికి అసలు ఎండ తగలడం లేదు. దీంతో విటమిన్ డి లోపం ఏర్పడుతోంది. ప్రస్తుతం మన దేశంలో అధిక శాతం మంది ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. చిన్నారుల్లో ఈ సమస్య అధికంగా ఉంటోంది. దీని వల్ల చిన్నారులకు విటమిన్ డి డ్రాప్స్‌ను ఇవ్వాల్సి వస్తోంది. అలాగే పెద్దలు కూడా చాలా మంది విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడుతున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడుతున్న వారు పలు విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
విటమిన్ డి ట్యాబ్లెట్లను సొంతంగా వాడకూడదు. కచ్చితంగా డాక్టర్ సూచన మేరకు ఉపయోగించాలి. విటమిన్ డి లోపం ఉంటే మన శరీరానికి తగిన విధంగా వైద్యులు డోసు నిర్ణయిస్తారు. ఆ ట్యాబ్లెట్లను ఎన్ని రోజులు ఏ సమయంలో వేసుకోవాలో నిర్దారిస్తారు. ఈ క్రమంలో వైద్యులు సూచించిన మేర మాత్రమే ఈ ట్యాబ్లెట్లను వాడాల్సి ఉంటుంది. కానీ కొందరు మాత్రం నిర్దేశించిన కాల పరిమితి కన్నా ఎక్కువ కాలం పాటు ఈ ట్యాబ్లెట్లను వాడుతారు. అలా ఎన్నడూ చేయకూడదు. అవసరం అయితే మళ్లీ టెస్టులు చేయించుకుని డాక్టర్‌ను కలిసి ఆ తరువాత మాత్రమే ఈ ట్యాబ్లెట్లను వాడాల్సి ఉంటుంది. విటమిన్ డి ట్యాబ్లెట్లను అధికంగా ఉపయోగిస్తే పలు దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విటమిన్ డి కొవ్వులో కరుగుతుంది. కనుక ఇది శరీరంలో నిల్వ ఉంటుంది. అయితే విటమిన్ డి ట్యాబ్లెట్లను ఎక్కువ కాలం పాటు వాడితే శరీరంలో దీని మోతాదు పెరిగిపోతుంది. దీంతో శరీరం విష తుల్యంగా మారుతుంది. శరీరంలో విటమిన్ డి మరీ అధికంగా ఉంటే ఆ పరిస్థితిని విటమిన్ డి టాక్సిసిటీ అంటారు. ఇది మరింత ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో పలు వ్యాధులు వస్తాయని వారు అంటున్నారు.
విటమిన్ డి శరీరంలో అధికంగా పేరుకుపోతే అప్పుడు అలాంటి స్థితిని హైపర్ విటమినోసిస్ డి అంటారు. అంటే మోతాదుకు మించిన విటమిన్ డి శరీరంలో ఉండడం అన్నమాట. ఈ స్థితిలో శరీరం తీవ్ర దుష్పరిణామాలను ఎదుర్కొంటుంది. శరీరంలో విటమిన్ డి మోతాదు మించితే, అది దీర్ఘకాలంగా అలాగే ఉంటే అప్పుడు వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే శరీరంలో క్యాల్షియం స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్పడుతాయి. కొందరిలో కిడ్నీలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. విటమిన్ డి స్థాయిలు అధికంగా ఉంటే కొందరికి బీపీ పెరుగుతుంది, అలాగే ఎముకలపై ప్రభావం పడుతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. అలసట, నీరసం ఉంటాయి. కిడ్నీలపై ఒత్తిడి పెరిగి మూత్రం సాఫీగా జారీ అయ్యేందుకు కష్టమవుతుంది. దీంతో కిడ్నీలపై అధికంగా భారం పడుతుంది. ఇలా విటమిన్ డి మోతాదు మించితే అనేక తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
విటమిన్ డి మనకు సాధారణంగా రోజుకు 600 ఐయూ మోతాదులో అవసరం అవుతుంది. విటమిన్ డి మనకు విటమిన్ డి2, డి3 అనే ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తుంది. ఇది మన శరీరంలో విటమిన్ డి గా మారుతుంది. విటమిన్ డి2 మనకు వృక్ష సంబంధ పదార్థాల ద్వారా లభిస్తే, డి3 జంతు సంబంధ పదార్థాల ద్వారా లభిస్తుంది. ఇవి రెండూ మన శరీరంలో విటమిన్ డిగా మారుతాయి. కనుక విటమిన్ డి పొందాలంటే వృక్ష లేదా జంతు సంబంధ పదార్థాలు వేటినైనా తీసుకోవచ్చు. నారింజ పండ్లు, అవకాడో, పుట్టగొడుగులు, చీజ్, పాలు, పెరుగు, చికెన్, మటన్, మటన్ లివర్, చేపలు, గుడ్లు వంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా విటమిన్ డి లభించేలా చూసుకోవచ్చు. విటమిన్ డి లోపం ఉన్నవారికి రోజుకు 6000 ఐయూ లేదా వారానికి 50,000 ఐయూ మోతాదులో విటమిన్ డి లభించేలా ట్యాబ్లెట్లను ఇస్తారు. ఈ క్రమంలోనే ట్యాబ్లెట్లను ఎంత కాలం పాటు వాడాలో అంతే కాలం పాటు వాడాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం పాటు వాడితే తీవ్ర దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.