Snoring | ప్రస్తుతం చాలా మందిని గురక సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. గతంలో కేవలం పురుషులు మాత్రమే అధికంగా గురక పెట్టేవారు. కానీ ఇప్పుడు స్త్రీలు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అలాగే చిన్నారులు కూడా కొందరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే గురక వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అధిక బరువు ఉన్నవారికి, వెల్లకిలా పడుకునే వారికి, ఇంట్లో పొడి వాతావరణం ఉన్నా, పలు ఇతర కారణాల వల్ల కూడా చాలా మందికి గురక వస్తుంది. అయితే గురక సమస్య ప్రత్యేకంగా ఎందుకు వస్తుంది.. అన్న ప్రశ్నకు కారణాలు ఏమీ లేవు, ఇది కొందరికి కొంత కాలం వచ్చి తరువాత దానంతట అదే తగ్గుతుంది. కనుక గురకకు ప్రత్యేకమైన కారణాలు ఏవీ ఉండవనే చెప్పాలి. అయితే గురక సమస్య ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు అనేక తంటాలు పడుతుంటారు. కానీ కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తుంటే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
సాధారణంగా నిద్రించే గదిలో పొడి వాతావరణం ఉంటే అది గురకకు కారణం అవుతుంది. పొడి వాతావరణం వల్ల ముక్కు రంధ్రాలు, గొంతు ఎండిపోతాయి. తేమ తగ్గుతుంది. దీంతో గాలి సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గాలి ఆగిపోయినట్లు అయి గురక వస్తుంది. అయితే గదిలో పొడి వాతావరణం వల్లే గురక సమస్య వస్తుంటే ఇందుకు హ్యుమిడిఫైర్ పరిష్కారం చూపిస్తుంది. మనకు ఇవి మార్కెట్ లో లభిస్తాయి. హ్యుమిడిఫైర్‌ను కొనుగోలు చేసి మీరు నిద్రించే గదిలో పెట్టాలి. దీని వల్ల గదిలో ఉండే పొడి వాతావరణం తగ్గుతుంది. తేమ పెరుగుతుంది. దీంతో ముక్కు రంధ్రాలు, గొంతు తేమగా మారుతాయి. ఫలితంగా గాలి సరఫరా సాఫీగా జరుగుతుంది. గురక రాకుండా ఉంటుంది. ఇలా గురక సమస్యకు హ్యుమిడిఫైర్తో చెక్ పెట్టవచ్చు.
ఇక గురక సమస్యకు అధిక బరువు కూడా కారణం అవుతుంది. కొందరు అధికంగా బరువు ఉండడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఇది గురక వచ్చేలా చేస్తుంది. కనుక అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. అలాగే పొట్ట దగ్గర ఉండే కొవ్వును కరిగించుకుంటే కూడా మేలు చేస్తుంది. కొందరికి పొట్ట దగ్గరి కొవ్వు అధికంగా ఉండడం వల్ల కూడా గురక వస్తుంది. కనుక గురక తగ్గాలంటే ఈ కొవ్వును కూడా కరిగించాల్సి ఉంటుంది. దీంతో గురకను సులభంగా తగ్గించుకోవచ్చు. గురక సమస్య ఉన్నవారు రోజూ యోగా, ప్రాణాయామం వంటివి చేస్తుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. వీటి వల్ల శ్వాసపై నియంత్రణ వస్తుంది. శ్వాస సరిగ్గా లభిస్తుంది. దీంతో గురక తగ్గుతుంది.
గురక సమస్య ఉన్నవారికి పలు ఇంటి చిట్కాలు కూడా పనిచేస్తాయి. పై దవడను అలాగే ఉంచి కింది దవడను ముందుకు తేవాలి. అనంతరం 10 అంకెలు లెక్కబెట్టాలి. ఇలా రోజుకు 7 నుంచి 10 సార్లు చేస్తే గురక సమస్య తగ్గుతుంది. రాత్రి పూట ఇలా చేయాల్సి ఉంటుంది. అలాగే పలికేందుకు కష్టమైన పదాలను నిత్యం 10 నుంచి 20 సార్లు పలకాలి. దీంతో కూడా గురకను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నాలుకను బయటకు పెట్టి స్ట్రెయిట్‌గా ఉంచి కిందకు, పైకి, ఎడమకు, కుడికి తిప్పాలి. ఇలా రోజుకు 2 నుంచి 4 సార్లు చేస్తుంటే గురకను తగ్గించుకోవచ్చు. అలాగే పొగ తాగడం, మద్యం సేవిండం వంటి అలవాట్లు ఉన్నవారు మానేయాలి. వాటి వల్ల కూడా గురక వస్తుంది. ముఖ్యంగా నిద్రించడానికి ముందు ఈ రెండు పనులు అస్సలు చేయకూడదు. ఒక గ్లాస్ వేడి పాలలో కొద్దిగా పసుపు వేసి కలుపుకుని నిద్రించే ముందు తాగాలి. దీంతో గురక రాదు. అలాగే వెన్నను కొద్దిగా తీసుకుని వేడి చేయాలి. అందులోంచి రెండు చుక్కలను తీసి నిద్రించడానికి ముందు ముక్కు రంధ్రాల్లో వేయాలి. ఇలా రోజూ చేస్తుంటే గురక సమస్య పోతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలిపి నిద్రించడానికి ముందు తాగాలి. దీని వల్ల కూడా గురక సమస్య తగ్గుతుంది. ఈ విధంగా పలు ఇంటి చిట్కాలను పాటిస్తుంటే గురక సులభంగా తగ్గిపోతుంది. హాయిగా నిద్ర పడుతుంది.