Telangana Police | అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన దీక్షల్లో ఉన్న పోలీసులు విధుల్లోకి రావద్దని, డ్యూటీలో ఉన్న సమయంలో ఎలాంటి మతాచారాలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యూనిఫామ్ ప్రమాణాలు, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా జుట్టు, గడ్డం పెంచడం, సాధారణ దుస్తులతో డ్యూటీ చేయడం, బూట్లు లేకుండా విధుల్లో ఉండటం కఠినంగా నిషేధించబడింది.
డ్యూటీలో ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించి అయ్యప్ప మాల ధరించిన కంచన్‌బాగ్ ఎస్సై కృష్ణకాంత్‌పై సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ మెమో జారీ చేయడం జరిగింది.యూనిఫామ్ తప్పకుండా ధరించాలి, జుట్టు, గడ్డం పెంచకూడదు, సివిల్ డ్రెస్సులో, బూట్లు లేకుండా డ్యూటీ నిషేధం, మత దీక్షలో ఉంటే ముందుగానే సెలవు తీసుకోవాలి అని సదరు డీసీపీ హుకుం జారీ చేశారు. పోలీసు ఉన్నతాధికారుల ప్రకారం, అయ్యప్ప దీక్ష వంటి మతపరమైన నియమాలు పోలీసు బాధ్యతలతో కుదరవని భావించి, ముందస్తు అనుమతి తీసుకుంటే రెండు నెలల వరకు సెలవులు కూడా మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ స్థాయి వరకు అనేక మంది పోలీసు సిబ్బంది అయ్యప్ప దీక్షలు చేపడుతున్న నేపథ్యంలో, యూనిఫామ్ డిసిప్లిన్ ప్రభావితం కావొచ్చన్న ఆందోళనలతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
పోలీసు శాఖ ఈ తాజా నిర్ణయంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఇదే సమస్య. హిందూ పోలీసులకే ఇలాంటి పరిమితులా?” అంటూ ప్రశ్నించారు.రంజాన్ సందర్భంగా ఇలాంటి ఆదేశాలు ఎందుకు జారీ చేయరని నిలదీశారు. మత స్వేచ్ఛను హరించే విధంగా ఈ ఆదేశాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసుల డ్యూటీ డిసిప్లిన్‌ను కాపాడాలనే ఉద్దేశంతో వచ్చిన ఈ ఆదేశాలు ప్రస్తుతం రాజకీయ, మత వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఒక్కవైపు పోలీసు శాఖ డ్యూటీ సమయంలో తటస్థత అవసరమని చెబుతుండగా, మరోవైపు ఈ ఆంక్షలు మతాచారాలపై ఆంక్షలుగా మారుతున్నాయంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ నిర్ణయం అమలు ఎలా సాగుతుంది? రాజకీయంగా ఇంకెలాంటి విమర్శలు తలెత్తుతాయి ? అనేది రాబోయే రోజుల్లో చూడాలి.