Celina Jaitly | ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై సంచలన ఆరోపణలు చేస్తూ గృహ హింస కేసు దాఖలు చేశారు. పీటర్తో విడాకులకు సిద్ధమైన ఆమె, అతడి కారణంగా తాను సుమారు రూ.50 కోట్ల వరకు ఆదాయం కోల్పోయానని, ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల క్రితం ముంబై కోర్టులో సెలీనా పిటిషన్ దాఖలు చేయగా, తాజాగా పీటర్ హాగ్కు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. మోసం, గృహ హింస, కూర్పు, శారీరక,మానసిక,లైంగిక వేధింపులు వంటి ఆరోపణలను ఆమె పిటిషన్లో పేర్కొంటూ, ఈ వేధింపుల కారణంగానే ఇంటి నుంచి పారిపోయి తిరిగి భారతదేశానికి రావాల్సి వచ్చిందని తెలిపింది.
భర్త ప్రతి ప్రయత్నంలోను తనను పని చేయకుండా అడ్డుకోవడంతో తన ఆర్థిక స్వేచ్ఛ కోల్పోయి పెద్ద నష్టం జరిగిందని, ఇది తన నటనా కెరీర్ను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఆరోపించింది. నెలకు రూ.10 లక్షల భరణం, తాను నివసిస్తున్న ముంబై ఇంట్లోకి అతడు ప్రవేశించకుండా ఆంక్షలు, ప్రస్తుతం ఆస్ట్రియాలో పీటర్తో ఉన్న ముగ్గురు పిల్లల కస్టడీని కూడా తానికే ఇవ్వాలని కోర్టును కోరింది. ఈ కేసు మంగళవారం జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ముందు విచారణకు రాగా, కోర్టు నోటీసులు జారీ చేసి తదుపరి వాదనలను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. సుమారు 15 ఏళ్ల క్రితం సెలీనా–పీటర్ వివాహం జరిగింది. వారికి విన్స్టన్, విరాజ్, ఆర్తర్ అనే ముగ్గురు సంతానం ఉన్నారు.
‘నో ఎంట్రీ’, ‘మనీః హై తో హనీ హై’, ‘అప్నా సప్నా మనీ మనీ’, ‘థాంక్యూ’, ‘గోల్మాల్ రిటర్న్స్’ వంటి చిత్రాల్లో నటించిన సెలీనా గతేడాది వరకూ భర్తతో అన్యోన్యంగా కనిపించినా, ఇప్పుడు విడాకుల దాకా వెళ్లడం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. సెలీనా జైట్లీ తన కెరీర్ ఆరంభంలో తెలుగులో మంచు విష్ణు సరసన సూర్యం సినిమాలో హీరోయిన్ గా నటించింది.