Nutrients Deficiency | అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాలు ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాహారం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు, వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. పోషకాల విషయానికి వస్తే కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లతోపాటు విటమిన్లు, మినరల్స్ కూడా ముఖ్యమే. ఇవన్నీ ఉండే ఆహారాలను రోజూ తీసుకుంటేనే మనకు మేలు జరుగుతుంది. అయితే పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్లను చాలా మంది రోజూ తీసుకుంటారు. కానీ విటమిన్లు, మినరల్స్ ను అన్నింటినీ రోజూ భర్తీ చేసేలా మాత్రం ఆహారం తినరు. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి కూడా అవసరమే. అయితే మన దేశంలో చాలా మందికి కొన్ని రకాల పోషకాహార లోపాలు కామన్‌గా ఉంటున్నాయి. ఈ లోపాలతో అధిక శాతం మంది బాధపడుతున్నారు.
మన దేశంలో చాలా మంది ఎదుర్కొంటున్న పోషకాహార లోపాల్లో విటమిన్ డి లోపం ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం చాలా మందికి కఠిన శ్రమ చేయడం లేదు. దీంతో సూర్య రశ్మిలో గడిపే అవకాశం లభించడం లేదు. ఫలితంగా శరీరం విటమిన్ డిని తయారు చేసుకోవడం లేదు. దీంతో విటమిన్ డి లోపం సమస్య అనేక మందిలో ఏర్పడుతోంది. విటమిన్ డి మనకు సహజసిద్ధంగా లభిస్తుంది. రోజూ ఉదయం కాసేపు శరీరానికి సూర్య రశ్మి తగిలేలా ఎండలో నిలబడాలి. దీని వల్ల శరీరంలో సహజసిద్ధంగా విటమిన్ డి తయారవుతుంది. దీంతో విటమిన్ డి లోపం నుంచి సునాయాసంగా బయట పడవచ్చు. ఇక విటమిన్ డి మనకు పలు ఆహారాల్లోనూ లభిస్తుంది. బెండకాయలు, పాలు, పాల ఉత్పత్తులు, నారింజ పండ్లు, కోడిగుడ్లు, పుట్ట గొడుగులు, చేపలు, కొన్ని రకాల నూనెల్లో మనకు విటమిన్ డి లభిస్తుంది. ఇది మనకు రోజుకు 600 ఐయూ మోతాదులో అవసరం అవుతుంది. కనుక ఆయా ఆహారాలను తీసుకుంటున్నా కూడా విటమిన్ డి లోపం నుంచి బయట పడవచ్చు.
ఇక మన దేశంలో చాలా మంది ఎదుర్కొంటున్న పోషకాహార లోపాల్లో విటమిన్ బి12 కూడా ఒకటి. ఎక్కువగా శాకాహారులు ఈ విటమిన్ లోపం బారిన పడుతుంటారు. అలాగే థైరాయిడ్ ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు, అధికంగా బరువు ఉన్నవారు విటమిన్ బి12 లోపంతో ఇబ్బంది పడుతుంటారు. విటమిన్ బి12 సాధారణంగా మనకు నాన్ వెజ్ ఆహారాల్లో ఎక్కువగా లభిస్తుంది. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, మటన్ లివర్, గుడ్లతోపాటు కొన్ని రకాల వెజ్ ఆహారాల్లోనూ దీన్ని పొందవచ్చు. పుట్టగొడుగులు, విత్తనాలు, నట్స్, సోయా, చీజ్ వంటి ఆహారాల ద్వారా ఇది మనకు లభిస్తుంది. ఇది మనకు రోజుకు 2.4 మైక్రోగ్రాముల మోతాదులో అవసరం అవుతుంది. కనుక ఆయా ఆహారాలను రోజూ తీసుకుంటుంటే విటమిన్ బి12 లోపాన్ని తగ్గించుకోవచ్చు.
ఇక మన దేశంలో చాలా మందికి ఫోలేట్ లోపం కూడా ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఫోలేట్ మనకు రోజుకు 400 ఎంసీజీ మోతాదులో అవసరం అవుతుంది. అదే గర్భిణీలకు అయితే 600 ఎంసీజీ మోతాదులో కావాలి. ఫోలేట్ మనకు ఎక్కువగా ఆకుపచ్చని కూరగాయలు, నిమ్మజాతి పండ్లు, రాజ్మా, కోడిగుడ్లు, పప్పు దినుసులను తినడం ద్వారా లభిస్తుంది. ఆయా ఆహారాలను రోజూ తీసుకుంటే ఫోలేట్ లోపం నుంచి బయట పడవచ్చు. అలాగే మన దేశంలో చాలా మందికి ఐరన్ లోపం కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఐరన్ లోపం వల్ల చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. మహిళలకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. కనుక వారు ఐరన్ ఉండే ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది. ఐరన్ మనకు రోజుకు 9 నుంచి 15 మిల్లీగ్రాముల మోతాదులో అవసరం అవుతుంది. పాలకూర, పుంటికూర, డార్క్ చాకొలెట్, దానిమ్మ పండ్లు, యాపిల్స్, టమాటాలు, చేపలు, మటన్, మటన్ లివర్ వంటి ఆహారాలను తినడం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. ఇలా ఆయా పోషకాల లోపం ఉన్నవారు ఆయా ఆహారాలను తింటుంటే ఆయా పోషకాహార లోపాల నుంచి సులభంగా బయట పడవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.