BCCI : సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ చేజార్చుకున్న భారత జట్టు(Team India) టీ20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టింది. 11 ఏండ్ల ఐసీసీ ట్రోఫీ(ICC Trophy) కలను సాకారం చేసుకునేందుకు కాచుకొని ఉంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ మెగా టోర్నీలో టీమిండియా కెప్టెన్ ఎవరు? అనే వార్తలకు తెరపడింది. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో జట్టును అద్బుతంగా నడిపించిన రోహిత్ శర్మ(Rohit Sharma) సారథిగా ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యహరిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపాడు.
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రోహిత్ మూడు ఫార్మాట్లకు కెప్టెన్. ఇది మా అందరి ఉమ్మడి నిర్ణయం. హర్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. ఒకవేళ వన్డే ప్రపంచకప్ మాదిరిగా పాండ్యా గాయపడితే.. మరొకరికి వైస్ కెప్టెన్సీ అప్పగిస్తాం’ అని జై షా వెల్లడించాడు. అంతేకాదు కెప్టెన్‌గా రోహిత్ శక్తిసామార్థ్యాలను శంకించే పని లేదని, అతడిపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపాడు.
‘అఫ్గనిస్థాన్‌తో జరిగిన టీ20లో 27 పరుగులకే 4 వికెట్లు పడ్డాయి. ఆ దశలో రోహిత్ విధ్వంసక సెంచరీతో జట్టును గెలిపించాడు. అతడి కెప్టెన్సీలో వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచాం. అయితే.. అనూహ్యంగా ఫైనల్లో తడబడ్డాం’ అని షా వెల్లడించాడు. ఈ ఏడాది జూన్‌లో జరుగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీకి వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్నాయి. తొలి పోరులో భారత జట్టు ఐర్లాండ్‌ను ఢీకొట్టనుంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు గొప్ప విజయాలు సాధించింది. నిరుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరింది. అయితే.. ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియా బౌలింగ్ దళం ధాటికి టాప్ ఆటాళ్లు విఫలం కావడంతో టీమిండియా ఓటమి పాలైంది. ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్‌ను సమం చేసిన రోహిత్ సే.. ఆ తర్వాత జరిగిన ఆసియా కప్‌లో విజేతగా నిలిచింది.
వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న క్రికెటర్లు
ఇక స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరినా.. ఆసీస్ పట్టుదల ముందు భారత్ నిలవలేకపోయింది. తొలుత బంతితో బౌలర్లు విజృంభించగా.. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో కంగారూ జట్టును గెలిపించాడు. దాంతో, 11 ఏండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలవాలనుకున్న టీమిండియా కల కల చెదిరినట్టైంది.