సూర్యాపేట, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని, మళ్లీ ఆ పార్టీని నమ్మి ఓటు వేయవద్దని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరించేందుకు గంటకుపైనే సమయం పడుతుందని అన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేకూరిన మేలు రెండు క్షణాల్లో చెప్పేందుకు కూడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
కూల్చుడు, బెదిరించుడు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు దండుకోవటమేనని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం సూర్యాపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనతో ఏం లాభం జరిగిందో ఆలోచన చేయాలని ఓటర్లకు సూచించారు. తన హయాం లో సూర్యాపేటకు రూ.ఏడువేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : సింగరేణిలో మెడికల్ బోర్డుపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుకు అవగాహన కొరవడిందని భూపాలపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారసభలో స్పష్టమైందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన భూపాలపల్లిలో మీడియాతో మాట్లాడారు. భూపాలపల్లిలో జరిగిన సీఎం సభకు కార్మికులు ఎంతో ఆశతో వెళ్లారని, అక్కడ ఎలాంటి స్పష్టమైన హామీలు రాకపోవడంతో నిరుత్సాహంతో వెనుదిరిగారనారు. 2025 మార్చి 21న చివరి బోర్డు జరిగిందని, కాంగ్రెస్ పాలనలో12 రెగ్యులర్ బోర్డులు పెట్టారని పేర్కొన్నారు. కేసీఆర్ 2018 మార్చి 9న కారుణ్య నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 106 బోర్డులు పెట్టారని గుర్తుచేశారు. ప్రస్తుతం 11 నెలలుగా మెడికల్ బోర్డు లేదని, బోర్డు కోసం 2 వేల మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు.