చొప్పదండి, ఫిబ్రవరి 9 : రేవంత్ రెడ్డి రాష్ట్రానికి శనిలాగ దాపురించాడని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. ఆయన 420 దొంగ హామీలతో గద్దెనెకారని, రెండేళ్లలో చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తున్నదని, అందరూ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. సోమవారం చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌తో కలిసి హాజరయ్యారు.
సాయంత్రం కరీంనగర్‌లోని 13, 29, 46, 47 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, కాల్వ మల్లేశం, కంజర్ల రేణుక, కంసాల శ్రీనివాస్, బోనాల శ్రీకాంత్ తరఫున ప్రచారం చేశారు. ఇటీవల గుమ్లాపూర్ సభకు వచ్చిన సీఎం రేవంత్ చొప్పదండి పట్టణానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సత్యం గంగాధరలో కొత్త డిగ్రీ కాలేజీ మంజూరైందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల కిందటే చొప్పదండిలో డిగ్రీ కాలేజీ ఉండేదని, అడ్మిషన్లు లేక గంగాధరకు మార్చారే తప్ప కొత్తగా మంజూరు కాలేదని స్పష్టం చేశారు.
చొప్పదండి పట్టణం అభివృద్ధికి 120 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన 100 పడకల దవాఖానను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు వినియోగంలోకి తీసుకు రావడం లేదని, ఇంటిగ్రేటెడ్ మారెట్, సెంట్రల్ లైటింగ్ పనులను ఎందుకు ప్రారంభించడం లేదని నిలదీశారు. బండి సంజయ్ ఏడేళ్ల కాలంలో ఏడు రూపాయల పని కూడా చేయలేని విమర్శించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని, కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని కోరారు.
ఈ సమావేశాల్లో మాజీ జడ్పీటీసీలు ఇప్పనపల్లి సాంబయ్య, మాచర్ల సౌజన్య -వినయ్, సర్పంచులు బంధారపు అజయ్‌కుమార్ గౌడ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ మినుపాల తిరుపతిరావు, మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, గడ్డం చుకారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు బత్తిని సంపత్, నాయకులు నలుమాచు రామకృష్ణ, వెల్మ నాగిరెడ్డి, గాండ్ల లక్ష్మణ్, బీఆర్ఎస్ 14 వార్డుల అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ చేసిందేమీ లేదు
మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న చొప్పదండిని మున్సిపల్‌గా అప్‌గ్రేడ్ చేసి, అభివృద్ధి చేసింది బీఆర్ఎస్సే. నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు. మేం పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించి 50 శాతానికి పైగా పనులు పూర్తి చేసినం. మిగిలినవి కూడా పూర్తి చేయడం కాంగ్రెస్ నాయకులకు చేతకావడం లేదు. కానీ, మున్సిపల్లో ఓట్లు అడగడానికి రావడం సిగ్గుచేటు. ఈ నెల 11న నిర్వహించే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.
– మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్