దామరచర్ల, సెప్టెంబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి పోలీసుల చిత్రహింసలకు గురైన యువకుడు ధనావత్ సాయిసిద్ధును అదే మండలంలోని కొత్తపేట తండాలో బుధవారం ఆయన పరామర్శించారు. తన ఇంటికి జగదీశ్‌రెడ్డి ఇతర నేతలు చేరుకోగానే సాయిసిద్ధు, ఆయన భార్య భూమిక కన్నీటిపర్యంతం అయ్యారు. వారి ఎదుట తనకు జరిగిన అన్యాయాన్ని దుఃఖభారంతో వివరించారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేక సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులను అడ్డంపెట్టుకొని అరాచక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పేదల ఇండ్లను కూలగొట్టడం, కేసులు పెట్టి జైళ్లకు పంపే చర్యలు రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వారి సంపాదనల్లో, కమీషన్లు దండుకోవడంలో మునిగిపోయారని ఆరోపించారు. తన పదవిని కాపాడుకునేందుకు సంపాదనలో 20 శాతం ఢిల్లీకి, రాహుల్‌గాందీ, మోదీకి సమర్పించుకొనే పనిలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ప్రతి సమస్యపై ఆర్తనాదాలు పెట్టాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో అమాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. కొందరు పోలీస్ అధికారులు సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఎస్సీలు ఐపీఎస్ అధికారులుగా గుర్తెరగాలని, కింది స్థాయి అధికారులను నియంత్రించాలని కోరినా మార్పు రావడం లేదని తెలిపారు. కొత్తపేట తండాకు చెందిన గిరిజన యువకుడు సాయిసిద్ధు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడని, తండాకుయూరియా కోసం ఆటోలో వెళ్లి అక్కడ చేస్తున్న ధర్నాలో పాల్గొన్నాడనే వీడియో చూపుతూ పోలీసులు గంటసేపు అక్రమంగా కొట్టారని తెలిపారు. అమాయకుడిని ర్బంధించి గంటలకొద్దీ లాఠీలతో కొట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాకేశ్‌రెడ్డి, నలమోతు సిద్ధార్థ, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, కే వీరకోటిరెడ్డి, ప్రకాశ్‌నాయక్, వీరూనాయక్, రవీందర్‌నాయక్, సచిన్, అమృనాయక్ తదితరులు ఉన్నారు.