మైలార్‌దేవ్‌పల్లి, సెప్టెంబర్ 24: ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే… మీ ఇంటి ముందు బుల్డోజర్ ఆగుత ది… నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలు సా..? మా జోలికి వస్తే పుట్టగతులుండవు’ ఇదీ రాష్ట్రంలో సర్కార్ తప్పును నిలదీసిన ప్రజలకు ఎదురవుతున్న బెదిరింపులు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన వారికి తమ ప్రతాపమేంటో చూపిస్తామంటూ కొందరు రెచ్చిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కొడంగల్‌లోని బీఆర్ఎస్ నేతకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి, చంపేస్తామంటూ బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. ‘మా స్థాయి ఏంటో తెలిసే వస్తున్నావా? పెద్దాయన గురించి మీకు పూర్తిగా తెలియదు. ఆయన అనుకుంటే రాత్రికిరాత్రే ‘మాయం’ చేయగలడు. అంటూ ఫోన్‌చేసి సదరు నేతకు వార్నింగ్ ఇచ్చారు. వివరాలల్లోకి వెళ్తే కొడంగల్‌లో అధికారులు రూ.45కోట్లతో, 4 కిలో మీటర్ల రోడ్డు విస్తరణ చేపట్టారు. పట్టణ శివారులోని గుండ్లకుంట గేటు నుంచి తాండూర్ రోడ్డు ప్రాంతంలోని బైపాస్ రోడ్డు వరకు విస్తరణ పనులు చేస్తున్నారు.
కాగా ఈనెల 20న రాత్రి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న చారిత్రక మహబూబ్ సుభానిచిల్లా దర్గాను తొలగించారు. దర్గా తొలగింపుతో ముస్లింలు ఆదివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ప్రార్థించే దర్గాను కూల్చివేయడం బాధకంగా ఉందని, కూల్చిన చోటే దర్గాను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అబ్దుల్ ముఖీద్ చందా నిరసనలో పాల్గొన్నారు. ప్రజలతో కలిసి దర్గా ఆనవాళ్లను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. సోషల్ మీడియాలోనూ ఆయన నిరసనలు వైరల్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం దురాక్రమణలకు పాల్పడుతున్నదని చాలామంది ప్రజలు కామెంట్లు పెట్టారు. దీంతో అబ్దుల్ ముఖీద్ చందాకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. ‘నీ ఇల్లు కూలగొడుతాం.. నీకు అడ్రస్ లేకుండా చేస్తం’ అని హెచ్చరించారు. అగంతకుల వెనుక ‘బిగ్‌బ్రదర్స్’ ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ వచ్చిన తెల్లారే ఆయన ఇంటి ముందు జీహెచ్ఎంసీకి చెందిన బుల్డోజర్లను నిలిపారు. హారన్ కొడుతూ నిద్రలేపారు. ఆ తర్వాత ఓ వైపు ఫోన్లో అగంతకులు బెదిరిస్తుండగా.. మరోవైపు ఇంటి ముందు అధికారులు బుల్డోజర్ మోహరించారు.
ఎందుకు ప్రశ్నిస్తున్నవు… కనబడకుండా చేస్తరు!
అబ్దుల్ ముఖీద్ చందా ఇంటి ముందు బుల్డోజర్ ఉండగానే ఆయనకు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి హెచ్చరించాడు. ‘నేను సన్నిహితుడినే కావచ్చు. కానీ ఎందుకు నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు. వారు అనుకుంటే నిన్ను కనిపించకుండా చేస్తారు. చెప్పింది నమ్మడం లేదు కదా… నీ ఇంటి ముందు బుల్డోజర్లు ఎందుకున్నాయో అర్థంచేసుకో’ అంటూ బెదిరింపులు చేశాడు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లో తెల్లవారుజామున ముఖీద్ ఇంటి ముందు జీహెచ్ఎంసీకి చెందిన రెండు బుల్డోజర్లు తీసుకొచ్చి హారన్లతో ఆయను నిద్రలేపారు. ఎందుకు నిలిపారని ప్రశ్నిస్తే పని ఉందని నిలిపామని…. అధికారులు పంపించారని బుకాయింపులు చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ నుంచి కదపలేదు. ఈ క్రమంలో ముఖీద్ చందా జీహెచ్ఎంసీ సిబ్బందిని నిలదీశారు. దర్గా కూల్చివేత విషయంలో ప్రశ్నించినందుకు.. నా ఇంటిని కూల్చేందుకు వచ్చారా? అంటూ మండిపడ్డారు. కొడంగల్‌కు పోవద్దని ఒకరు… పోతే నీ సంగతి చూస్తా అంటూ మరోకరు.. వారితో పెట్టుకోవద్దంటూ మరోకరు ఇలా ఫోన్లల్లో బెదిరించడమేమిటని ప్రశ్నించారు. ఆ తర్వాత మా వాహనాలు చెడిపోయాయంటూ బల్దియా సిబ్బంది అక్కడ నుంచి జారుకున్నారు.