ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యంలో, రాజ్యాంగంలోని లోపాలు నేడు బీసీ, ఎంబీసీ, సంచార, అర్ధ సంచార జాతుల కులాలకు శాపంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1993 నుంచి 2025 వరకు ఓబీసీ/బీసీ రిజర్వేషన్ల అమల్లో క్రీమీలేయర్ (సంపన్న శ్రేణి) ఆదాయ పరిమితిని పది సార్లు పెంచాలి. కానీ, నేటి వరకు నాలుగు సార్లు మాత్రమే సమీక్షించి, పెంచడం వల్ల లక్షలాది మంది ఓబీసీ/బీసీ విద్యార్థులు, నిరుద్యోగులు రిజర్వేషన్లను కోల్పోతున్నారు.
విశ్వనాథ్ ప్రతాప్సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వం 1990లో కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తింపు పొందిన ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వారికి 27 శాతం రిజర్వేషన్లను అమలుచేసింది. తొమ్మిది మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 6:3 మెజారిటీతో ఈ రిజర్వేషన్లను ఆమోదించింది. ఓబీసీ/బీసీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ (సంపన్న శ్రేణి) వర్గాలను గుర్తించి, వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించాలని ఆ తీర్పులో ధర్మాసనం పేర్కొంది. అందుకుగానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 1992లో ఓబీసీలలో సంపన్న శ్రేణి వారిని గుర్తించడానికి జస్టిస్ రామ్నందన్ ప్రసాద్ అధ్యక్షతన జాతీయ స్థాయి నిపుణుల కమిటీని కేంద్రం నియమించింది. సదరు కమిటీ ఓబీసీ కులాల్లోని ఆరు వర్గాలకు చెందినవారి సంతతిని సంపన్న శ్రేణిగా గుర్తిస్తూ నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకా రం 1. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు; 2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సం స్థల ఉద్యోగులు; 3. పారామిలటరీ, వాయుసేన, నావికా దళాల అధికారులు; 4. వ్యాపారుల వార్షిక ఆదాయం; 5. వ్యవసాయ భూములను ఆస్తులుగా కలిగినవారు; 6. వార్షిక ఆదాయ పరిమితి ఉన్నవారు సంపన్నశ్రేణి కిందికి వస్తారు. ఇందులో చివరిదైన ఆదాయ పరిమితిలో తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పరిమితిని లక్ష రూపాయలుగా-ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయాలను మినహాయించి నిర్ధారించింది. అదేవిధంగా ప్రతి మూడేండ్లకోసారి పునఃసమీక్షించి ఆదాయ పరిమితిని పెంచాలని సూచిస్తూనే, అవసరమైతే రూపాయి విలువ హెచ్చుతగ్గులను దృష్టిలో పెట్టుకొని కాలపరిమితికి ముందే సమీక్షించాలని చెప్పింది. ఆ నివేదికను 1993లో ఆమోదిస్తూ అప్పటి కేంద్రం ఉత్తర్వులను జారీచేసింది. అయినా నేటికీ నాలుగే సార్లు ఆదాయ పరిమితిని పెం చడం విచారకరం. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2017లో సంపన్న శ్రేణి వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది.
కేరళ ప్రభుత్వం బీసీ కులాల్లోని సంపన్న శ్రేణి వారిని గుర్తించడానికి కేంద్రం నిర్ధారించిన నిబంధనలను మార్చింది. 1999లో ఇంద్రా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇం డియా కేసు తీర్పులో కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. సంపన్న శ్రేణి నిర్ధారణకు కేంద్ర నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది. అప్పటినుంచి దేశంలోని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు కేంద్రప్రభుత్వ నిబంధలను అమలు చేస్తున్నాయి.
1993 నుంచి నేటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రతి మూడేండ్ల కు క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని సమీక్షిం చి పదిసార్లు పెంచినట్లయితే, నేడు వార్షిక ఆదాయ పరిమితి రూ.30 లక్షలుగా ఉండేది. ఆదాయ పరిమితి నిబంధనను సమీక్షించి, ఆ పరిమితిని పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ పరిమితిని పెంచడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా లక్షలాది మంది ఓబీసీ/బీసీ విద్యార్థులు జన్మతః రాజ్యాంగయుతంగా పొందాల్సిన రిజర్వేషన్లను కోల్పోతున్నారు. 1992 నాటి మండల్ కమిషన్ తీర్పులో రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాన అంశాల గురించి సుప్రీం వివరంగా చెప్పింది. ఇందులో రిజర్వేషన్లను స్థూలంగా రెండు రకాలుగా పేర్కొంది. 1.షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను సామాజిక/నిలువు రిజర్వేషన్లుగా పరిగణించాలని, 2.మహిళా, దివ్యాంగులు, స్పోర్ట్స్, పదవీ విరమణ పొం దిన సైనికుల రిజర్వేషన్లను సమాంతర/ ప్రత్యేక రిజర్వేషన్లుగా పరిగణించాలని తెలిపింది. ఆర్టికల్స్ 15(4), 16 (4) ప్రకారం అమలుచేస్తున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను కుల ప్రాతిపదికన కల్పించిన రిజర్వేషన్లుగా; ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను కుల ప్రాతిపదికన కాకుండా వర్గాల/తరగతుల ఆధారంగా కల్పించినట్లు చూడాలని సదరు తీర్పులో తెలిపింది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ/బీసీ జాబితాల్లో కులాలను చేరుస్తున్నాయి కనుక, ఆయా కులాల కుటుంబాల్లో సామాజికంగా అభివృ ద్ధి చెందినవారిని సం పన్న శ్రేణిగా గుర్తించి రిజర్వేషన్లు పొందే అర్హ త నుంచి వారిని మినహాయించాలన్నది.
భారత రాజ్యాంగ రచనలోనే బీసీ కులాలకు అన్యాయం జరిగింది. కులాలను కాస్త వర్గాలుగా/ తరగతులుగా గుర్తించారు. అం దుకే, ఓబీసీ/బీసీ క్రీమీలేయర్ సమస్యను అధిగమించాలంటే రాజ్యాంగ సవరణే మార్గమని గుర్తించాలి. రాజ్యాంగంలో విద్య, ఉద్యోగాల్లో ఓబీసీ/బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అధికరణలు 15(4), 15(5) 340, 338బీ, 342ఏ, 366లోని 26 (సీ)లో సూచించినట్టు ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు’ అనే పదాలను ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా’ మార్చాలి.
అదే విధంగా స్థానిక సంస్థల్లో ఓబీసీ/బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 243డీ, 243టీ అధికరణల్లో పేర్కొన్నట్టు ‘వెనుకబడిన తరగతి పౌరులు’ అనే పదాలను ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా’ మార్చాలి. ఇలా చేయకపోతే ఓబీసీ/బీసీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ సమస్య, జనాభా దామాషా పద్ధతిలో బీసీ రిజర్వేషన్ల పెంపు, బడ్జెట్లో ఆర్థిక వాటా మొదలగు సమస్యలను అధిగమించడం అసాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం తక్షణమే బీసీ రిజర్వేషన్ల అమలుపై న్యాయపరమైన సమస్యల శాశ్వత పరిష్కారానికి రాజ్యాంగాన్ని సవరించాలి.
ఓబీసీ/బీసీ కులాల సంపన్న శ్రేణి వార్షిక ఆదాయ పెంపు విషయంలో కేంద్రప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదు. 1993లో నిర్ధారించిన ఆరు నిబంధనలను కొనసాగిస్తూనే, చివరిదైన ఓబీసీ/బీసీల సంపన్న శ్రేణి వార్షిక ఆదాయాన్ని ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయాలను మినహాయించి రూ.30 లక్షలకు పెంచేందుకు చర్యలు చేపట్టాలి.