ఫజల్ అలీ కమిషన్ నివేదిక బయటికి వచ్చాక ఆంధ్ర రాజకీయ నాయకులకు కాళ్ల కింద భూమి కంపించింది. మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. ఒకే భాష అని మూడేండ్ల నుంచీ డప్పుకొడుతూ తిరుగుతున్న వారందరికీ కమిషన్ స్పష్టం చేసిన విషయాలతో గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. తమ కమిషన్ భాషాప్రయుక్త రాష్ర్టాలను తీర్చిదిద్దటానికి ఏర్పడలేదని, రాష్ర్టాల గురించిన వివిధ అంశాలను పరిశీలించి ఏర్పాటుచేసే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ అని ఫజల్ అలీ కుండబద్దలు కొట్టాడు. రాష్ర్టాలను ఏర్పాటు చేయడానికి అతి ముఖ్యమైన అంశం ఆర్థిక పరిస్థితి అని, ఆ విషయంలో తెలంగాణ కంటే ఆంధ్ర చాలా వెనుకబడి ఉన్నదని తమ నివేదికలో స్పష్టం చేశాడు నిజమైన న్యాయమూర్తి, కమిషన్ అధ్యక్షుడు ఫజల్ అలీ. పైగా ఎవరూ అన్యాయానికి పాల్పడకుండా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ వారి భయాలన్నీ నివేదికలో పొందుపరిచాడు.
తెలంగాణవారిలో అత్యధికులు ఆంధ్రను కలుపుకోవడానికి ఇష్టపడటం లేదని సుస్పష్టంగా లిఖించాడాయన. పైగా రెండు ప్రాం తాలను కలిపితే వారి భయాలు నిజమయ్యే అవకాశం ఉందని, అలా జరిగితే కలయిక వల్ల తెలంగాణకు నష్టమే అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. నివేదిక బహిర్గతమయ్యాక తెలంగాణలో ఆనందం, ఆంధ్ర రాజకీయ నాయకుల హాహాకారాలు పెల్లుబుకాయి. ఎవరి ప్రతిస్పందన ఎలా ఉన్నదో చూద్దాం! 1956, ఆగస్టు 31న రాష్ట్రపతి ఆమోదించిన ఈ నివేదిక ఇంత స్పష్టంగా, నిష్పాక్షికంగా ఉంటే, దాన్ని విస్మరించి రెండు ప్రాంతాలను కలిపి తెలంగాణ 6 దశాబ్దాల పాటు కడగండ్లు పడటానికి ముఖ్య కారకులెవరో పరిశీలిద్దాం.
1.తెలంగాణ, ఆంధ్ర విలీనం వల్ల తెలంగాణకు ఎట్టి ప్రయోజనం కలుగదు. లాభాల కన్నా నష్టాలే ఉన్నాయి ఎక్కువగా తెలంగాణ వారికి. – మర్రి చెన్నారెడ్డి, (గోలకొండ పత్రిక, 27-11-1955), 2.తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సిఫారసు చేసి కమిషన్ ఎంతో రాజకీయ విజ్ఞతను, దూరదృష్టిని చూపించింది. – కె.వి.రంగారెడ్డి, 3.కమిషన్ సిఫారసులను ఆమోదించవలసి ఉంటుంది. – అనంతశయనం అయ్యంగార్, డిప్యూటీ స్పీకర్, లోక్‌సభ ఎంపీ, తిరుపతి, 4.నివేదిక సంతోషాన్ని కలిగించింది. – ఏఐసీసీ సభ్యులు, సుప్రీంకోర్టు న్యాయవాది, గుంటూరు, 5.రాష్ట్ర పునర్విభజన సంఘం చేసిన సిఫారసులు, ముఖ్య సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. – బూర్గుల రామకృష్ణారావు, ముఖ్యమంత్రి, విలేకరుల గోష్ఠిలో. 6.విశాలాంధ్ర అభిమానులు ఆశాభంగం చెందినప్పటికీ, అందరూ సిఫారసులను ఆవేశరహితంగా పరిశీలించాలి. – బూర్గుల రామకృష్ణారావు, (ఆంధ్ర పత్రిక, 12-10-1955)
తెలంగాణ నాయకులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తే, ఈ ప్రాంతానికే చెందిన స్వామీరామానంద తీర్థ మటుకు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ‘వెంటనే విశాలాంధ్ర నిర్మాణానికి సిఫారసు చేయనందుకు విచారిస్తున్నాను. ఆంధ్రలో తెలంగాణ విలీనమవడాన్ని 1961 వరకు వాయిదా వేయడం మాత్రమే కాక, అప్పుడు ఏర్పడే అసెంబ్లీ (తెలంగాణ)లో రెండు వంతుల మెజారిటీతో నిర్ణయించాలన్న షరతు పెట్టడం తగదు. ఇప్పటి రాష్ట్ర అసెంబ్లీకే ఆ అవకాశం ఇవ్వాలి. – కాంగ్రెస్ నాయకుడు (లాతూర్ మరాట్వాడా, హైదరాబాద్)
సామాజిక కార్యకర్త, విద్యావేత్త, అన్నింటికి మించి సన్యాసి అయిన రామానంద తీర్థకు తెలంగాణ వారి భయాలు, అంతవరకు చూసిన ఆంధ్రవారి దోపిడి గుణం, ఆధిపత్య ధోరణి, స్వార్థపరత్వం అర్థం కాకపోవడం ఆశ్చర్యమే! నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ఈయనకు బహుశా మత విద్వేషం ఉండి తెలంగాణ సామాన్య ప్రజల భయాలు అర్థం కాలేదేమో! 1972లో మరణించిన ఈయనకు 1969 ఉద్యమంతో జ్ఞానోదయమై ఉండొచ్చు.
ఇక విశాలాంధ్ర సిద్ధాంతం పట్టుకున్న వారికి మాత్రం గట్టిదెబ్బ తగిలింది. కానీ, ఆంధ్ర జాతి కదా! వారి కుట్రలు వెంటనే మొదలుపెట్టేశారు. ఇది వారి మాటల్లోనే తెలుసుకోవచ్చు. పైగా జాతీయ కాంగ్రెస్ సభ్యులు వీరికి ఆత్మీయులు. 1.రాష్ర్టాలు సంప్రదించుకొని తగు మార్పులు చేసుకోవచ్చు. – కాంగ్రెస్ జాతీయ కార్గవర్గం, ఢిల్లీ. 2.శాసనసభా సమావేశాల్లో విశాలాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని హైదరాబాద్ రాష్ట్ర ప్రొగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ నిర్ణయించింది. – ఆంధ్ర పత్రిక, (17-10-1955). ఆంధ్ర కమ్యూనిస్టు నాయకులతో అంటకాగిన తెలంగాణ కమ్యూనిస్టులకు తమ ప్రాంతం మీద అభిమానం కంటే కమ్యూనిస్టు సిద్ధాంతాలపై ప్రేమ ఎక్కువైనట్టు అనుకోవాలి. 3.నాలుగైదేండ్ల తర్వాత విశాలాంధ్ర ఏర్పడవచ్చు. కానీ, ఈలోగా అనేక ఆటంకాలు కలుగవచ్చు. భాషా ప్రయుక్త రాష్ట్ర విచారణ సంఘం ఇచ్చిన సిఫారసులకు అప్పటికి కాలదోషం పట్టవచ్చు. కేంద్ర కాంగ్రెస్ సభ్యులు నివేదికను చర్చించక పూర్వమే ఆంధ్ర, హైదరాబాద్ ముఖ్యమంత్రులు సమావేశమై ఏకాభిప్రాయం వెలువరిస్తే బాగుంటుంది. విశాలాంద్ర వాయిదా పడితే ఆంధ్రకు ప్రమాదం. – అల్లూరి సత్యనారాయణరాజు, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు (ఆంధ్రపత్రిక, 19-10-1955). 4. విశాలాంధ్ర వాయిదా పడకూడదు. కేంద్రంతో వెంటనే మాట్లాడాలి. – ఆంధ్ర మంత్రివర్గం, (ఆంధ్ర పత్రిక, 20-10-1955) ఇప్పుడు అబద్ధాలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇంకా ఇతర ఆంధ్ర వార్తా పత్రికలు మనకు అనుభవమే. అట్లాగే మద్రాసు నుంచి ఒక ఆంధ్రుడు నడిపే ‘ఆంధ్ర పత్రిక’ కూడా ఆ రోజుల్లో అబద్ధాలను ప్రచారం చేసేది. విశాలాంధ్ర సిద్ధాంతం బలపరచడానికి ప్రజలను రెచ్చగొడుతూ అబద్ధాలను బ్యానర్‌గా పెట్టేది ఆ రోజుల్లో.
1.హైదరాబాద్ మంత్రుల్లో ఎవరూ విశాలాంధ్ర నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ, కొంతకాలం ఆగితే బాగుంటుందని అనుకుంటున్నారు. (ఆంధ్రపత్రిక, 22-10-1955), ఇది శుద్ధ అబద్ధం. 2. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని ఫజల్ అలీకి చెప్పిన కె.వి.రంగారెడ్డి ఏదో సమావేశంలో విశాలాంధ్ర కావాలన్నారని బ్యానర్ వార్త ప్రచురించింది ఆంధ్ర పత్రిక. తద్వారా ఆంధ్ర పత్రిక అబద్ధాల పత్రికగా మారింది. పైగా ‘విశాలాంధ్ర ఇప్పుడు ఏర్పడకపోతే ఆరేండ్ల తర్వాత ఎవరూ కోరరు’ అని ఆంధ్ర జనాలను రెచ్చగొట్టింది. (23-10-1955) 3.ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో విశాలాంధ్ర ఏర్పాటుపై ఇరు రాష్ర్టాల మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. (ఆంధ్ర పత్రిక, 24-10-1955). ఈ బ్యానర్ వార్త కూడా శుద్ధ అబద్ధం.
4.విశాలాంధ్ర ఏర్పాటుకోసం జరిగిన సమావేశంలో ఉద్యోగాలు, అభివృద్ధి పథకాలు మొదలైన విషయాల్లో తెలంగాణ ప్రజల భయాలను తొలగించే హామీలను ఆంధ్ర నాయకులు వారిముందు సిద్ధంగా పెట్టారు. (ఆంధ్ర పత్రిక, 27-10-1955) ఈ అబద్ధాలే కాక, ఆంధ్ర పత్రిక వార్తల్లో తెలంగాణ వారికి బెదిరింపులు కూడా నర్మగర్భంగా ఉండేవి. 5.హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠీ, కన్నడ ప్రాంతాలు తీసివేస్తే తెలంగాణ రాష్ట్రం చిన్నగా అయిపోతుంది. హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రాముఖ్యం పూర్తిగా తగ్గిపోతుంది. పౌరుల ఆర్థిక జీవనం కూడా దెబ్బతింటుంది. (ఆంధ్ర పత్రిక, 29-10-1955). ఒక దేశంగా ఉన్న ప్రాంతంలో కొద్ది భూమి తగ్గితే దాని ప్రాభవం తగ్గుతుందన్నది ఎంత తెలివి తక్కువ భావన! కానీ, ఈ వాక్యం చంద్రబాబు నాయుడు చదవాలి. ‘హైదరాబాద్‌ను నేనే నిర్మించాను, ప్రపంచ పటంలో పెట్టింది కూడా నేనే’ అన్న పైత్యపు మాటలు మానే అవకాశం ఉంటుంది. ఆంధ్ర వారు కలిసినప్పుడే ప్రపంచంలోనే ప్రముఖ నగరంగా హైదరాబాద్ ఉండేదని ఆయన తెలుసుకోవాలి.
ఆంధ్ర నాయకులు బుజ్జగించారో, బెదిరించారో తెలియదు కానీ, అప్పటిదాకా ఫజల్ అలీ కమిషన్ సిఫారసు బాగుందన్న తెలంగాణ ముఖ్యమంత్రి, దానినే అమలు చేస్తామని అన్న మనిషి.. హఠాత్తుగా తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. 1955, అక్టోబర్ 28న పత్రికా ప్రతినిధులతో తన అభిప్రాయాన్ని వెలువరించినప్పుడు వారంతా నిశ్చేష్ఠులయ్యారు. ‘ఐదారేండ్లు విశాలాంధ్రను వాయిదా వేయడం రాజకీయ అస్థిరత్వానికి దారితీస్తుంది. హైదరాబాద్ ప్రాముఖ్యం అలాగే ఉంటే 20 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో ఉంటుంది తప్ప, ఫజల్ అలీ కమిషన్ సూచించినట్టు 9 జిల్లాల రాష్ట్రంలో ఉండదు. ఇప్పుడు కలిస్తేనే తెలంగాణ ప్రజల అభిప్రాయాలు మారుతాయి కానీ, ఆరేండ్ల తర్వాత కాదు. ఆంధ్ర సోదరులు అభివృద్ధి, ఉద్యోగావకాశాల విషయంలో ఇస్తున్న హామీల వల్ల విశాలాంధ్రలో తెలంగాణ వారికి ఇప్పుడే మంచి లాభం ఉంటుంది. 1961లో కూడా విడివిడిగా ఉంటే రాజకీయంగా అనిశ్చితి సమస్య ఉంటుంది. అల్లకల్లోలమవుతుంది. యావత్ దేశం హితం ప్రకారం చూస్తే, భాషాపరంగా కూడా విశాలాంధ్ర ఏర్పడటమే వాంఛనీయం. తెలంగాణ ప్రజలు వ్యక్తీకరించిన అభిప్రాయాల గురించి ఫజల్ అలీ కమిషన్ ఎక్కువగా ఊహించుకుంది’ అని బూర్గుల గట్టిగా చెప్పేటప్పటికి ఎవరికీ నోట మాట రాలేదు. తానా అంటే తందానా అంటూ రామానంద తీర్థ కూడా.. ‘తెలంగాణ ఎప్పటికీ బలిష్ఠంగా ఉండలేదు. దేశం మధ్యలో ఒక బలహీన రాష్ట్రం ఉండటం మంచిది కాదు. విశాలాంధ్ర రాష్ట్రం భారత రిపబ్లిక్లో బలిష్ఠంగా, శక్తివంతంగా ఉంటుంది’ అని తన అమూల్యమైన అవగాహనారాహిత్యంతో కూడుకున్న అభిప్రాయాన్ని వెల్లడించాడు. వీటన్నింటినీ తెలంగాణను నరకటానికి కత్తిపుచ్చుకుని సిద్ధంగా ఉన్న ఆంధ్ర పత్రిక సంతోషంగా 1955, అక్టోబర్ 30 నాటి తన సంచికలో ప్రచురించింది.
మొదట చెప్పిన అభిప్రాయానికి విరుద్ధంగా ఆంధ్ర రాజకీయ నాయకుల మాటలు నమ్మి 2 కోట్ల జనాభా వ్యతిరేకిస్తున్నా, సంవత్సరానికి 90,029,000 పౌండ్ల ఆదాయం ఉన్న (అప్పటి భారత రూపాయల్లో చెప్పాలంటే 120 కోట్లు) సుసంపన్న హైదరాబాద్ రాష్ర్టాన్ని, కేవలం 22 కోట్ల ఆదాయం ఉండి, కేంద్రం దగ్గర 12 కోట్ల రూపాయలు అప్పు చేసి చేతులెత్తేసిన ఆంధ్ర రాష్ట్రంతో కలపడానికి ఒప్పుకున్న బూర్గుల రామకృష్ణారావు కనీసం ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కూడా అవ్వలేదు. ఆంధ్ర నాయకుల స్వార్థం వల్ల పొట్టి శ్రీరాములు ప్రాణాలు పోగొట్టుకుంటే, వారి మోసపూరిత రాజకీయాల వల్ల బూర్గుల తన పదవిని పోగొట్టుకున్నాడు. 1967లో మరణించిన ఆయన ఆంధ్ర రాజకీయ నాయకుల దోపిడికి, వివక్షాపూరిత రాజకీయాలకు గురైన తెలంగాణ ప్రజల కోసం తప్పక బాధపడి ఉంటాడు. ఈ ప్రమాదకర పరిస్థితిని నిజమైన తెలంగాణ వారు ఎలా వ్యతిరేకించారనేది వచ్చే వ్యాసంలో..!